ఆమనగల్లు, మే 2 : యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2060 బీ గ్రేడ్ కు రూ. 2040 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సెక్రటేరియట్లో సోమవారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పై పూర్తి సమీక్ష జరిగిందని, ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసిందన్నారు. దీంతో ఇక నుంచి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా వేగవంతంగా పనులు పూర్తవుతాయన్నారు.
కేఎల్ఐ ఢీ-82 కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.27 కోట్ల పరిహారం త్వరలో వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావుకు ఆదేశించినట్లు తెలిపారు. నియోజకవర్గం అన్ని జాతీయ రహదారులతో చాలా అభివృద్ధి చెందుతుందని, రైతులు ఎవ్వరు కూడా తమ భూములను అమ్ముకోవద్దని సూచించారు. ఆనంతరం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ లో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. తదనంతరం విఠాయిపల్లి గ్రామానికి చెందిన బన్నే మంగమ్మకు రూ. 28 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెంకటేశ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, సింగల్ విండో వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, ఎంపీటీసీ దోనాదుల కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, గుత్తి బాలస్వామి, కమఠం వెంకటయ్య, వస్పుల సాయిలు, రూపం వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
నిరుపేదల ఆరోగ్యానికి భరోసా
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన దేవేందర్‌కు రూ.20 వేలు, కడ్తాల్ గ్రామానికి చెందిన జంగయ్యకు రూ.15 వేలు, మక్తమాదారం గ్రామానికి చెందిన సాయిలు కు రూ.24 వేలు, సాలార్‌పూర్ గ్రామానికి చెందిన మహేశ్వరికి రూ.18 వేలు, చల్లంపల్లి గ్రామానికి చెందిన రూ.42 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. జడ్పీటీసీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, సులోచన, కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీలు మంజుల, ప్రియ, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు నర్సింహ, వీరయ్య, సేవ్యానాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ ఉన్నారు.