రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అన్నదాతను మే నెల ఊరించగా.. జూన్ నెల ఉసురు తీస్తున్నది. మే, జూన్ నెల మొదట్లో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాత పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశాడు. యాచారం, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు తదితర మండలాల్లో 50 శాతానికిపైగా రైతులు పత్తి విత్తనాలు వేశారు. ఈ నెల మొదట్లో వర్షాలు కురువడంతో ఆ విత్తనాలు మొలకెత్తాయి. గత పది రోజులుగా వాన కురువకపోవడంతో పత్తిపంట ఎక్కడికక్కడ ఎండిపోతున్నది. వర్షాల కోసం అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. జిల్లాలోని పలు మండలాల్లో అన్నదాత పత్తి పంటను సాగు చేసేందుకు అధికంగా పెట్టుబడులు పెట్టాడు. పంట మొలకెత్తే సమయంలో వర్షాలు పడకుంటే మొత్తం ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడితే ఏమి కాదని.. వానలు పడకుంటే పంట మొత్తం ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
70,000 ఎకరాలకు పైగానే..
జిల్లాలో రుతుపవనాలు ముందుగానే రావడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. మే నెలతోపాటు జూన్ మొదటి వారంలో వర్షాలు సమృద్ధిగా కురువడంతో పత్తి పంటను అధికంగా సాగు చేశారు. జిల్లాలో 70,000 ఎకరాలకు పైగా ఆ పంటను సాగు చేసినట్లు సమాచారం. మే నెలాఖరు, జూన్ ప్రారంభంలో వానలు ఊరించి.. ఇప్పుడు వాన దేవుడు మొహం చాటేయడంతో అన్నదాత తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నాటిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొంటున్నాడు. వానలకోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు.
కురవని వాన..ఎండుతున్న పంట
ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని పత్తి విత్తనాలను వేశా. పత్తి మొలక రాగానే వానదేవుడు మొహం చాటేయడంతో పూర్తిగా ఎండుముఖం పట్టింది. అప్పులు చేసి పత్తి విత్తనాలు వేశా. ఎండిపోతే నా పరిస్థితి అంతే.. వాన దేవుడా కరుణించు..
-మైసయ్య, మాడ్గుల
ఎండిపోతున్నపత్తిపంట
మే నెలాఖరు, ఈ నెల ప్రారంభంలో కురిసిన వానలతో పత్తి పంట వేశా. తీరా మొలకలు వచ్చే సమయంలో వానదేవుడు మొహం చాటేయడంతో పంట మొత్తం ఎండిపోతుంది. వాన దేవుడు ముందు మురిపించి..తర్వా ఉసురు తీస్తున్నాడు. రెండు, మూడు రోజుల్లో వానలు కురవకుంటే మొత్తం పంట ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది
-శంకరయ్య, మాడ్గుల మండలం