అబిడ్స్, డిసెంబర్ 27 : దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహిస్తారు. ఇందులో దాదాపు 2400 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు స్టాళ్లను పొందిన నిర్వాహకులకు స్టాళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
జనవరి 1 ప్రారంభం నాటికి దాదాపు అన్ని స్టాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యేలా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి ఈ.రాజేందర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 1938 సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అప్పట్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించే వారు. ఆ తరువాత 1946లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్‌కు దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌కు ప్రజాదరణ ఉంది. దీంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడంతో వాటి విక్రయాలకు కేంద్రంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.
సుమారు 2400 స్టాళ్ల ఏర్పాటుతో కొనసాగే ఈ ఎగ్జిబిషన్ నగర ప్రజలనే కాకుండా పొరుగు జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి సందర్శనకు వచ్చే వారిని అలరిస్తోంది. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్లో కొలువుదీరనున్నాయి. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి కావస్తుండటంతో పలు స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
మొత్తం 32 సబ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల సహకారంతో ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేసేందుకు సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ రుసుము గత సంవత్సరం మాదిరిగానే రూ.40 నిర్ణయించడంతో పాటు క్షణాల్లో ఎగ్జిబిషన్‌ను చుట్టుముట్టి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మినీ ట్రైన్‌కు రూ.30 ధరను నిర్ణయించారు. గత సంవత్సరం దాదాపు 25 లక్షల వరకు సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించగా, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మంది సందర్శకులు తరలి వచ్చేలా సొసైటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళా విద్యా వ్యాప్తికి గాను మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించింది. పలు జిల్లాల్లో ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో 20 విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఏటా ఆయా విద్యా సంస్థల ద్వారా దాదాపు 30 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.