రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డిజిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఆదివారం శంషాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పార్టీ గెలువకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసే అవకాశమున్నదని పేర్కొన్నారు. అయినప్పటికీ మనమంతా ధైర్యంగా ముందుకెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గోడమీద పిల్లిలా వ్యవహరించేవారికి అవకాశమివ్వొద్దని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దొడ్డిదారిన సహకార సంఘం అధ్యక్షులను మారుస్తున్నదన్నారు. ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేక దొడ్డిదారిన అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పలువురు చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా.. కోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యంగా రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట నిలబడుతున్నారని పేర్కొన్నారు. అలాగే, పింఛన్లు పెంచలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్లి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ జెండా పట్టుకుని బీజేపీ ఎజెండాను అనుసరిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని మండిపడ్డారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినాష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సహకార సంఘాల చైర్మన్లు, పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికల విజయం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తే అధికారులు చెప్పుచేతుల్లోకి వస్తారని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పంతాలకు వెళ్లవద్దని, ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, పంతాలకు వెళ్లకుండా పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించిందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అన్న విధంగా పాలన సాగుతున్నదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనీ సరిగ్గా అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.