వికారాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 10 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో అత్యధికం టీఎం-33 దరఖాస్తులే .. మరోవైపు ఆర్ఎస్ఆర్ సమస్యతోనూ పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్ తదితర దరఖాస్తులూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. మరోవైపు కలెక్టర్ స్థాయి లో ధరణి దరఖాస్తులు అప్రూవల్ అయినా టెక్నికల్ సమస్యతో ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ విషయాన్ని సీసీఎల్ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడంలేదని జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కొత్త మార్గదర్శకాల జారీ పేరిట ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు ఇవ్వకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ధరణి పోర్టల్‌పై నియమించిన కమిటీ కొన్ని కొత్త ఆప్షన్లు సూచించడంతో అన్నదాతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.
క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ అనంతరం తహసీల్దార్లు రిపోర్టు ఇచ్చినా మళ్లీ ఆర్డీవోలు, రెవెన్యూ అదనపు కలెక్టర్, తదనంతరం కలెక్టర్ ఆమోదం తప్పనిసరి చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్ఏ జారీ చేసిన నూతన మార్గదర్శకాలతో కాలయాపనే తప్ప మేలు జరుగదని రైతుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా కేవలం ఒకట్రెం డు ఆప్షన్లు మినహా మిగతా ఆప్షన్లకు తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో రెండు, మూడు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ధరణి ఆపరేటర్లు చేసిన తప్పిదాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టా భూములు కూడా అసైన్డ్, భూదాన్, వక్ఫ్ భూములుగా ధరణిలో తప్పుగా ఎంట్రీ కావడంతో ఏండ్లుగా కార్యాలయాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నా ఫలితంలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం సంబంధిత భూమికి చెందిన రికార్డులు అన్ని పట్టా భూమిగా చూపుతున్నా పరిష్కారం మాత్రం జరుగడం లేదు. సంబంధిత భూమి పట్టా భూమిగా తహసీల్లార్లు రిపోర్టు ఇచ్చి కలెక్టర్ ఆమోదం తెలిపినా సీసీఎల్ఏ అధికారులు మాత్రం సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లోనే పెడుతున్నారు.
సీసీఎల్ఏలో రిపోర్టులను లెక్కచేయకుండా డబ్బును పరిగణనలోకి తీసుకొని టీఎం-33 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ స్థాయిలోనే పట్టా భూమి అసైన్డ్ లేదా భూదాన్, వక్ఫ్ భూమిగా తప్పుగా ఎంట్రీ అయిందని గుర్తించినప్పుడు కింది స్థాయిలోనే ఎందుకు పరిష్కరించడం లేదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. సీసీఎల్ఏకు అధికారాలు అప్పజెప్పడంతో ధరణి దరఖాస్తులకు మోక్షమెప్పుడో అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నట్లు ధరణి ఆపరేట ర్లు తప్పుగా ఎంట్రీ చేయడంతో ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమైనది. దీని పరిష్కా రానికి రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాత రికార్డుల ప్రకారం సంబంధిత సర్వే నంబర్లలో ఏ రైతుకు ఎంత భూమి ఉందనే వివరాలను తెలుసుకొని ఆర్ఎస్ఆర్ సమస్యను పరిష్కరించొచ్చు.. కానీ, ధరణిలో ఎంట్రీ అయిన వివరాలను ప్రమాణికంగా తీసుకొని అధికారులు ఆర్ఎస్ఆర్ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పేరిట ఎక్కువ భూమి ఉన్నట్లు ధరణిలో ఎంట్రీ కావడంతో గుర్తించడం పెద్ద కష్టంగా మారడంతోపాటు సంబంధిత రైతులు సహకరించకపోవడంతో ఆర్ఎస్ఆర్ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే ఈ సమస్యల పరిష్కా రానికి ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
నాకు పూడూరు మండలం, గట్పల్లి గ్రామంలోని సర్వేనంబర్ 112/ఉ లో 30 గుంటల భూమి ఉన్నది. ఆ భూమికి సంబంధించి నా పేరిట పాసు పుస్తకాలు కూ డా వచ్చాయి. అయితే ధరణిలో మాత్రం ఆ భూమి నా తండ్రి బాలయ్య పేరిట తప్పుగా ఎంట్రీ అయ్యింది. దానిని నా పేరిట సరిచేసుకునేందుకు గత ఆరు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. తహసీల్దార్‌తో సహా కలెక్టర్‌కు కూడా అప్లికేషన్‌ను అందజేశా. అయితే పది రోజుల క్రితం నేను పెట్టుకున్న దరఖాస్తును కలెక్టర్ అప్రూవల్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. కానీ, ఇంకా ధరణిలో మాత్రం నా తండ్రి పేరునే ఆ భూమి ఉన్నది. రెవెన్యూ అధికారులను అడిగితే టెక్నికల్ సమస్యతో పెండింగ్‌లో ఉందని.. త్వరలోనే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. దయచేసి నా భూసమస్యను పరిష్కరించాలి
-మంగలి పుల్లయ్య, మేడిపల్లి, పూడూరు మండలం