సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ ) : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. వీరు తమ పరిధిలోని డిస్కంలలో విద్యుత్తు సరఫరా, నిర్వహణలపై పర్యవేక్షిస్తుంటారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్తు సరఫరాలో వీరి పాత్ర కీలకంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డైరెక్టర్ల ను తొలగించి వారి స్థానంలో సీజీఎం లు, సీఈ స్థాయి అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత కొత్త డైరెక్టర్ల నియామకానికి ఆయా సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చాయి. నోటిఫికేషన్ ఇవ్వడం, దరఖాస్తుల స్వీ కరణ శరవేగంగా పూర్తిచేసినా డైరెక్టర్ల నియామకం మాత్రం నెలలు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. కనీసం దరఖాస్తుల పరిశీలన కూడా జరగలేదని దరఖాస్తుదారుల్లో కొందరు చెబుతున్నారు.