జిల్లావ్యాప్తంగా 3.25 లక్షలకు పైగా రైతులు ఉండగా, వీరిలో సుమారు 30 వేల నుంచి 40వేల మంది కౌలు రైతులు ఉన్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కౌలు డబ్బులు చెల్లించి, పెట్టుబడికి అప్పులు చేసి, తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పత్తి, వరికి మధ్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటున్నది. రైతులు పంటను అమ్ముకోవాలంటే భూమి పాస్బుక్కు, బ్యాంకు పాస్‌బుక్కులు తప్పనిసరి చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
కౌలు రైతులకు పాస్‌బుక్కులు లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తీసుకోవడంలేదు. ఒకవేళ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మండల వ్యవసాయాధికారి లేదా మండల వ్యవసాయ విస్తరణాధికారి ధ్రువీకరించిన సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లను కొన్ని కేంద్రాల్లో అనుమతిస్తుండగా, మరికొన్ని కేంద్రాల్లో అనుమతించకపోవడంతో కౌలు రైతులు మధ్య దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. భూమి యాజమాని పాస్బుక్కు ద్వారా అమ్ముకుందామన్నా తమ డబ్బులు వారి ఖాతాల్లో జమవుతాయి కాబట్టి వారు తిరిగి డబ్బులు ఇస్తారో లేదోనన్న అయోమయంలో ఉన్నారు. తప్పని పరిస్థితిలో అధిక శాతం మంది కౌలు రైతులు దళారులకే పంటను విక్రయిస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ)
పంట కొనేందుకు కొర్రీలు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే అధికారులు నానా కొర్రీలు పెడుతున్నారు. కౌలుకు భూమి తీసుకుని సాగు చేస్తున్నందున దానికి సంబంధించి సర్టిఫికెట్ తీసుకోవాలని తిప్పుకుంటున్నారు. తీరా సర్టిఫికెట్ తీసుకెళ్తే కొన్ని కొనుగోలు అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కౌలు రైతులను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.
దళారులకే అమ్మాల్సి వస్తున్నది..
కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతుల ధాన్యాన్ని తీసుకోకపోవడంతో దిక్కులేక దళారులకే పంటను అమ్ముకోవాల్సి వస్తున్నది. కౌలు చెల్లించి, పెట్టుబడికి అప్పులు చేశాం. తక్కువ ధరకే అమ్ముకున్నాం. ఎవుసానికి అయిన ఖర్చు కూడా రాక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఉన్న రైతులనే పట్టించుకుంటుందా.. మాలాంటి కౌలు రైతులకు దిక్కేది. ప్రభుత్వం ఆదుకోవాలి.
అప్పులు మీదపడుతున్నయ్..
కౌలు డబ్బులు చెల్లించి, పెట్టుబడికి అప్పులు చేసి వ్యవసాయం చేస్తే అప్పులే మీదపడుతున్నయ్. వ్యవసాయంపై ఆధారపడి బతికే మాకు.. వేరే పని చేయలేక వ్యవసాయంతోనే పోరాడుతున్నం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లోకి రానివ్వడం లేదు. మండలంలో కౌలుదారు సర్టిఫికెట్ తీసుకురమ్మంటున్నరు. తీరా సర్టిఫికెట్ తీసుకొచ్చాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకోకుండా భూమి పాస్‌బుక్, బ్యాంకు ఖాతా అంటూ గోస పెడుతున్నరు. ఎంతకో అంత అని మధ్య దళారులకు పంటను అమ్ముతున్నం. తక్కువ ధరకే కొనుగోలు చేసి మా శ్రమను దోచుకుంటున్నరు. మా రెక్కల కష్టమంతా వడ్డీవ్యాపారులకే సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకుని న్యాయం చేయాలి.
– కట్ట యాదయ్య, నల్లచెరువు