తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం తెలంగాణ మంచినీళ్ల పండుగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. కందుకూరు మండలంలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ను సందర్శించి మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండగా..సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో తాగునీటి కష్టాలు తీరాయని.. ఇంటింటికీ శుద్ధి చేసిన నీరు అందుతున్నదని పేర్కొన్నా రు. ఒకప్పుడు తాగునీటి కోసం మహిళలు అరిగోస పడ్డారని.. బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే దుస్థితి ఉండేదన్నారు. ఇప్పుడా ఆ పరిస్థితి ఉందా అని ప్రజలను ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భగీరథుడని కొనియాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల పండుగలో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
కందుకూరు, జూన్ 18 : మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచినీళ్ల పండుగను కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉండేవని.. సీఎం కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు అందించిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పిన మాట ప్రకారం మిషన్ భగీరథ ద్వారా నీరు అందించినట్లు చెప్పారు. దీంతో తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్లపై ఆందోళనలు చేశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ భగీరథుడని తెలిపారు.
తాగునీటి కోసం మహిళలు అరిగోసపడ్డారని మంత్రి పేర్కొన్నారు. మహిళల గౌరవం కాపాడడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. రక్షిత మంచినీరు అందిస్తుండడంతో సీజనల్ వ్యాధులు తగ్గి ఇతర వ్యాధులు, ఫ్లోరోసిస్ సమస్యల నుంచి రాష్ట్ర ప్రజలు దూరమయ్యారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కూడా కాలనీల భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూ.210 కోట్లతో నూతన పైపు లైన్లు, రిజర్వాయర్లు, ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలాగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్గర్ జల్ అనే పేరుతో చేపట్టగా ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీలు జంగారెడ్డి, జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎంపీపీలు జ్యోతి, కృపేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ శమంత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహరెడ్డి, దశరథ ముదిరాజ్, మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, సర్పంచ్ రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, యూత్ నాయకులు కార్తీక్, విజ్ఞేశ్వర్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్‌రెడ్డి, వాటర్ గ్రిడ్ అధికారులు చంద్రమౌళి, నర్సింహులు, ప్రియంకారెడ్డి, కిరణ్‌కుమార్‌గౌడ్, రాజశేఖర్, జగన్మోహన్రెడ్డి, ప్రణీత్, పావని, సౌమ్య, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.