కడ్తాల్, జూన్ 2: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలను పరమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్, అమరవీరుల స్తూపం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు ఒకరికొకరు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లపాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ తన పోరాటాలతో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల మెడలు వంచి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని ఆయన సాధించారని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు సంక్షేమ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు రాబోయే రోజుల్లో కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు.