వికారాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని కొంతమం ది తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పలు మం డల రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాదు ధరణి ఆపరేటర్, ఆర్ఐ నుంచి తహసీల్దార్ స్థాయి వరకు ఒక్కో స్థాయిలో వారు అడిగినంత ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని.. లేదంటే ఏదో కొర్రీ పెట్టి పెండింగ్‌లోనే పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసమస్యలకు సంబంధించిన రిపోర్టు నుంచి భూముల రిజిస్ట్రేషన్ల వరకు అందినకాడికి దండుకుంటున్నట్టు తహసీల్దార్లపై ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుక్ చేసుకున్నారంటే సంబంధిత మండల అధికారులకు డబ్బులు ముట్టజెప్పడం తప్పనిసరి అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే భూమిని కొన్న పట్టాదారును కొందరు తహసీల్దార్లు నేరుగా గుడ్‌విల్ కింద డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు కంప్యూటర్ ఆపరేటర్లతో డబ్బు లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రిజిస్ట్రేషన్లు పూర్తైన వెంటనే గుడ్‌విల్ ముట్టజెప్పాలంటూ పలు మండలాల అధికారులు కండీషన్స్ పెట్టినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత గుడ్‌విల్ ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పూర్తైన పత్రాలను అందజేస్తున్నారంటూ పలువురు తహసీల్దార్లపై విమర్శలున్నాయి. మరోవైపు జిల్లాలోని పరిగి, బంట్వా రం, మోమిన్‌పేట, దోమ మండలాల తహసీల్దార్లపై వసూళ్లకు సంబంధించి తీవ్ర ఆరోపణలున్నాయి.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో భూబాధితుల నుంచి వచ్చే వినతులను త్వరగా పరిష్కరించాలని ఉన్నతాధికారులు రెకమండ్ చేసినా పలు మండలాల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఫైళ్లు పెండింగ్‌లో ఉండడంతో రైతులు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో మండల రెవెన్యూ యం త్రాంగం రిపోర్టు తప్పనిసరి కావడంతో ఇదే అదునుగా చేసుకున్న కొందరు అధికారులు అందిన కాడికి దండుకుంటున్నట్టు సమాచారం. డబ్బులిస్తేనే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్ కదులుతున్నది. అంతేకాకుండా తప్పుగా ఎంట్రీ అయి కష్టాలు పడుతున్న పేద రైతులనూ రెవెన్యూ అధికారులు వదలిపెట్టడం లేదు.
ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయుల్లో దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తవుతున్నా తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. కలెక్టర్‌కు అందజేసే రిపోర్ట్‌కు ఎకరాకు రూ.10-20 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ యంత్రాంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతోనే వారు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. పరిగి తహసీల్దార్‌తోపాటు బంట్వారం, మోమిన్‌పేట, దోమ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆరోపణలున్నాయి. పరిగి తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలతో రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించగా..ఇటీవల కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ లాగిన్తోనే జరుగుతున్నాయని, రిజిస్ట్రేషన్లలోనూ, భూభారతి దరఖాస్తుల విషయంలోనూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారమూ జరుగుతున్నది. !