శామీర్‌పేట, ఫిబ్రవరి 16: ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరం జగద్గిరిగుట్ట వాసి పూమాల కుమారుడు బాలు(26) బీటెక్ పూర్తి చేసి ఐటీసీ కంపెనీలో పని చేస్తున్నాడు.
జగద్గిరిగుట్టలో ఐదుగురు తన స్కూల్ క్లాస్ మెట్లు – సందీప్‌సాగర్(27), రాంపల్లి సందీప్, సాయిచందర్, నాగరం వాసి ఒగ్గు బాలకృష్ణ, కర్ర నితీష్‌కుమార్ ఆదివారం సెలవు కావడంతో పార్టీ చేసుకుందామని అనుకున్నారు. అందుకోసం నగర శివారు ప్రాంతంలోని పొన్నాల్ గ్రామానికి వెళ్లారు. ఆ పొన్నల్ గ్రామంలో అమ్మవారిని దర్శించుకుని కోడిని కోశారు. అక్కడే వంట ఏర్పాట్లు చేసుకుని వెంట తెచ్చుకున్న మద్యం, కల్లు తాగారు. అందులో ముగ్గురు పొన్నాల్‌కు పనిమీద వెళ్తున్నామని వెళ్లారు.
అక్కడే ఉన్న బాలు, సందీప్ సాగర్, బాలకృష్ణ.. సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇద్దరు ఈత కొడుతుండగా ఒకరు మాత్రం నీటికి అవతల వైపు ఉండి చూస్తున్నాడు. ఈత కొడుతున్న వారిలో ఒకరు మునిగి పోతున్న విషయం గమనించిన (ఒడ్డుపై) ఉన్న స్నేహితుడు తన స్నేహితుడ్ని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈ విషయం గమనించిన స్థానికులు నీటిలోకి దిగవద్దు.. లోతుగా ఉంటుంది అని హెచ్చరిస్తూ చెరువు వద్దకు చేరుకున్నారు. నీటిలో మునిగిన వారిని కాపాడే ప్రయత్నించినా.. అప్పటికే ఇద్దరు నీటిలో మునిగి పోయారు.
ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు నీటి ఒడ్డున ఉన్న నలుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీటిలో గల్లంతైన వారి కోసం ఫైర్ సిబ్బంది, ఈతగాళ్లు సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. అయిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలిన బాలకృష్ణ, సందీప్, సాయి చందర్, నితీష్‌కుమార్‌లను స్టేషన్‌కు తరలించారు.