రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాల్లో ఇప్పటినుంచే తాగునీటి సమస్య తలెత్తుతున్నదని, ఈ సమస్య మునుముందు మరింత జఠిలమవుతుందని ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, యాచారం, మంచాల వంటి మండలాల్లో తాగునీటి సమస్య ఇప్పటికే తలెత్తుతున్నది. మంచినీటి కోసం స్థానికంగా వనరులు లేకపోవడంతో ప్రజలంతా మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డారు. మిషన్ భగీరథ నీటి విడుదలలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా కూడా నీటి సమస్య ఉత్పన్నమవుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ, మున్సిపాలిటీల్లోని ఆయా ప్రాంతాలకు డిమాండ్‌కు అనుగుణంగా మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు. ఎండాకాలంలో నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమస్య తలెత్తుతున్నది. మరోవైపు, మరమ్మతుల కారణంగా కూడా నీటి సరఫరా రోజుల తరబడి నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 21 మండలాలకు ప్రతిరోజూ మిషన్ భగీరథ ద్వారా 106 ఎంఎల్డీల కృష్ణా తాగునీరు సరఫరా చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 108.37 ఎంఎల్డీల తాగునీరు అవసరముండగా.. ప్రస్తుతం 106 ఎంఎల్డీల నీటిని మాత్రమే అందిస్తున్నారు. దీంతో జిల్లా డిమాండ్‌కు తగ్గట్టు నీరురాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 989 ఆవాసాలుండగా.. డిమాండ్‌ను బట్టి ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తాగునీరు అందించాల్సి ఉంటుంది. కానీ, మారుమూల ప్రాంతాలకు మాత్రం రెండు మూడురోజులకోసారి మాత్రమే తాగునీరు వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. అలాగే మండలాల్లోని చివరి గ్రామాలకు నీటి సరఫరా సరిగా జరగడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు వంటి వసతులు ఉన్నప్పటికీ.. వాటినెవరూ సరిగా వినియోగించడంలేదు. వచ్చే వేసవిలో చేతిపంపులు, బోరుబావులను వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలో వేసవి కాలంలో నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ట్యాంకర్లు, ఫిల్టర్ల ద్వారా అందించే తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతున్నది. ప్రజల అవసరాలకు సరిపడా కృష్ణాజలాలు రాకపోవడంతో ఎక్కువమంది ఫిల్టర్ నీటిపైనే ఆధారపడ్డారు. అలాగే గృహ అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 నుంచి 700 వరకు ధరలు పెంచారు. అలాగే ఫిల్టర్ నీటిని 20 లీటర్ల క్యాన్‌ను రూ.10 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. మునుముందు ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వేసవిలో పెరుగుతున్న నీటి అవసరాలను గుర్తించి, అదనంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని 989 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో వేసవిని దృష్టిలో ఉంచుకుని, అవసరాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవుటర్ లోపలి గ్రామాలన్నింటికీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా తాగునీటిని అందిస్తున్నాం. అవుటర్ వెలుపల మున్సిపాలిటీలతోపాటు గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నాం. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
– మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్