రంగారెడ్డి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, ఉపాధ్యాయుల బోధన విధానం, భోజన వసతులు, పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషక అహారం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వసతులను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగు నీరు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ తదితర సదుపాయాల కల్పన విషయాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 70 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు కొత్త ఆవిషరణలు రూపొందించేలా.. శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకునేలా తయారు చేయాలన్నారు. అండర్ వెయిట్లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి ఎదుగుదలకు అవసరమైన పౌష్టిక ఆహారం, మెడికల్ సదుపాయాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
పాఠశాలను రోల్ మాడల్‌గా తీర్చిదిద్దేందుకు పాఠశాలలో భోజన శాల, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వసతులకు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుంటామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్టును తయారు చేసి డీఈవోకు అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు, ఎంఈవో శంకర్ తదితరులు ఉన్నారు.
గండిపేట మండలం కిస్మత్‌పుర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాయాన్ని కలెక్టర్ శశాంక సందర్శించి, విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడే విధంగా, చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కచ్చితంగా ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.