రంగారెడ్డి, జూలై 26(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అటకెక్కుతున్నది. కనీసం పాఠశాలలను ఊడ్చేవారు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుభ్రం చేసేవారు లేక తరగతి గదులు, పాఠశాల ఆవరణలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుపుమొక్కలు, చెత్తాచెదారంతో నిండుతున్నాయి. జిల్లాలోని 1,309 ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక ఈ పరిస్థితి నెలకొన్నది. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు తరగతులకు హాజరుకావాల్సిన దుస్థితి ఏర్పడింది.
పరిశుభ్రత పాఠాలకే పరిమితం..
గత పదేండ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మన ఊరు- మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట సదుపాయాలు ఒనగూరుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతున్నది. పాఠశాలల ఆవరణలు అపరిశుభ్రంగా మారుతుండగా.. మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత పాఠాల వరకే పరిమితమవుతున్నది. అపరిశుభ్రత కారణంగా తమ పిల్లలు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పట్టించుకోని పారిశుద్ధ్య కార్మికులు..
మల్టీపర్పస్ సిబ్బంది స్థానంలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో మల్టీపర్పస్ సిబ్బందితో పాఠశాలలను శుభ్రపర్చుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం, ఉన్నచోట తరగతులు ప్రారంభమైన తర్వాత వస్తుండడంతో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు..
కొన్నిచోట్ల పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలలవైపే రావడంలేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే చొరవ చూపిస్తున్నారు. తలా ఇంత డబ్బులు పోగుచేసి ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య పనులను చేయించుకుంటున్నారు. అక్కడక్కడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులే పాఠశాలలను శుభ్రం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వర్షాకాలంలో మరింత అధ్వానం..
ప్రస్తుత వర్షాకాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనగా.. వర్షం నీటితో పాఠశాలల పరిసరాలు కంపుకొడుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో కలుపు మొక్కలు, చెత్తాచెదారంతో పేరుకుపోతున్నాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. మున్ముందు పరిస్థితి ఇలాగే కొనసాగితే.. విద్యార్థులు వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.