రంగారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ప్రత్యేకాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భోజనం, మౌలిక వసతులు, వన మహోత్సవం, మొక్కలు నాటడం, మహాలక్ష్మి పథకం వంటి సంక్షేమ పథకాలు అర్హులకు అందడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రభుత్వాధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న 21 మండల పరిషత్‌లు, 16 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 521 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేకాధికారులు వారానికోసారైనా తమకు కేటాయించిన బాధ్యతలను క్షేత్రస్థాయికి వెళ్లి నిర్వర్తించాల్సి ఉన్నది. కాని, ప్రత్యేకాధికారులు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు. కొంతమంది ప్రత్యేకాధికారులు ఏడాది గడిచినప్పటికీ బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి.
ఒక్కొక్క ప్రత్యేకాధికారికి మూడు నుంచి నాలుగు వరకు మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. జిల్లా అదనపు కలెక్టర్‌తో పాటు వివిధ జిల్లాస్థాయి అధికారులకు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేకాధికారులు ఆయా మున్సిపాలిటీలకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల తీర్మానాలకు సైతం ప్రత్యేకాధికారుల వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించుకుని వస్తున్నారు.
అర్హులకు అందని సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, రేషన్‌కార్డులు, సబ్సిడీ విద్యుత్, గ్యాస్ వంటి పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు ఇవ్వాలని నిర్ణయించింది. కాని, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడం వలన ఈ పథకాలకు సంబంధించిన జాబితాను కూడా అధికార పార్టీ నాయకులు నిర్ణయిస్తున్నారు. ప్రత్యేకాధికారులు మొక్కుబడిగా వారిచ్చిన లిస్టులను ఫైనల్ చేసి పంపిస్తున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందడంలేదని పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన వారికి ఇండ్లను అందజేయకపోగా, అనర్హులకు ఇండ్లు కేటాయించడంతో జిల్లావ్యాప్తంగా నేటికి 40 శాతం ఇండ్లు కూఆ నిర్మాణానికి నోచుకోలేదు. జిల్లాకు మొదటి విడతలో సుమారు 20వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 65 శాతం మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన ఇండ్లను నిర్మించకుండానే వదిలివేస్తున్నారు. కొంతమంది తమకు ఇండ్లు వద్దని వెనక్కి కూడా ఇస్తున్నారు. అలాగే, అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా అందడంలేదనే ఆరోపణలున్నాయి.
పడకేసిన పారిశుధ్యం
పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం పడకేసింది. నిధుల కొరతతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ముందుకు సాగడంలేదు. అలాగే, మౌలిక వసతులు కూడా లేక గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగుకాల్వలను శుభ్రం చేయడం, వీధి దీపాల ఏర్పాటు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం వంటి పనులకు కూడా నిధులు లేకపోవడంతో కార్యదర్శులే అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.