వికారాబాద్, అక్టోబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట నందివాగు ప్రాజెక్ట్, వికారాబాద్ మండలం గొట్టిముక్కల సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌లలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న చేప పిల్లలను స్పీకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న చేపల రకాలను పెంచితే అధిక లాభాలు వస్తాయని తెలిపారు. అవసరమైన చోట మత్స్యకార భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కోట్‌పల్లి చెరువు అభివృద్ధి, సుందరీకరణ కోసం అడగగానే సీఎం రూ.110 కోట్లు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలోని మిగిలిన చెరువుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. చెరువులు, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా రైతుల పొలాలకు మంచిగా సాగునీరు అందుతుందని, చేపల పెంపకంతో మత్స్యకారులకు మంచి లాభాలు వస్తాయన్నారు. టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు.
వికారాబాద్ కూరగాయల మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని కూరగాయల మార్కెట్లో రూ.1.14 కోట్లతో నూతనంగా నిర్మించే 24 దుకాణాల సముదాయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వికారాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి అనుమతులు ఇచ్చారన్నారు. మార్కెట్‌కు అవసరమైన అభివృద్ధి పనులు చేసుకోవచ్చన్నారు. మార్కెట్లో ఇతర వసతులకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.
అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికులకు యూనిఫాం దుస్తులను స్పీకర్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మార్కెటింగ్, మత్స్య శాఖల అధికారులు, మత్స్య సంఘాల సభ్యులు, కూరగాయల వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.