వికారాబాద్, డిసెంబర్ 25 : కారు అదుపు తప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పర్యాటకులు సాగర్, రఘు, గుణశేఖర్(24), పూజిత, మోహన్ కారులో తెల్లవారుజామున వికారాబాద్ అనంతగిరి హిల్స్‌కు వస్తున్నారు. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట చెరువు వద్ద అదుపుతప్పి ఉదయం 5 గంటల సమయంలో కారు చెరువులోకి దూసుకుపోయింది. గమనించిన స్థానికులు 100, 108కి సమాచారం అందజేశారు. కారు నీటిలో మునిగిపోవడంతో నలుగురు బయటపడగా వారిని పట్టణంలోని ఓ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గుణశేఖర్ అనే యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో చెరువులో పడ్డ కారును బయటకు తీశారు.
గజ ఈతగాళ్లతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి చెరువు పరిసరాలను పరిశీలించారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని పోలీసులకు సూచించారు.
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వికారాబాద్ సీఐ ఆధ్వర్యంలో రెస్క్యూటీంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా 11 గంటల తరువాత గుణశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఐదుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని.. వీరందరూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారని, కారును మోహన్ అనే వ్యక్తి నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నదని, పూర్తి విచారణ తరువాత వివరాలు తెలుస్తాయన్నారు. సంఘటనా స్థలానికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వికారాబాద్ సీఐ శ్రీను, ఎస్సై అన్వేశ్‌రెడ్డి, పోలీసులు, నాయకులు, ప్రజలు తరలివచ్చారు.