Govt Schools | తుర్కయంజాల్, జూన్ 6 : సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో వెంటాడుతున్న సమస్యలు విద్యార్ధుల తల్లిదండ్రులను అందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండగా కొన్ని చోట్ల మాత్రం విద్యార్ధులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులను చేర్పించడానికి విద్యార్ధుల కుటుంబ సభ్యులు జంకుతున్నారు. ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్రమం మొదలుకాగా సమస్యలపై విద్యార్ధుల తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు ఏ విధముగా సమాధానం చెప్పాలి అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కొహెడ, కమ్మగూడలోని పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే ప్రభుత్వ బడుల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో పాఠశాల తరగతి గదుల మరమ్మతులు జరుగుతాయ లేదా అనే ప్రశ్న ఉత్పనం అవుతుంది. ముఖ్యంగా కొహెడ పాఠశాలలోని ఓ తరగతి గది శిథిలావస్థకు చేరి స్లాబ్ కూలిపోయింది. అయితే పాఠశాల సెలవు దినంలో స్లాబ్ కూలిపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అంతేగాక పాఠశాల ఆవరణలో గుంతులు ఉండడంతో కొద్ది పాటి వర్షానికి పాఠశాల గ్రౌండ్ అంతా జలమయంగా మారుతుండడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు పెచ్చులు ఉండి విద్యార్ధులు గాయాపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. పేద విద్యార్ధుల చదువు కోరకు ఏర్పడిన పాఠశాలలో సరైన మౌళిక వసతులు లేకపోవడంతో పేద,మధ్య తరగతి విద్యార్ధులకు చదువు దూరం కానుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలలలో సమస్యలను పరిష్కరించకపోతే పేద,మధ్య తరగతి విద్యార్ధులు చదువు దూరం అయ్యే పరిస్థతి ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తున్న కొహెడ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య సైతం గణనీయంగా ఉంటుంది. ఇలాంటి పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్ధులు పాఠశాలలో చదువుకోవడానికి ఆసక్తి చూపుతారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.