Gut Bacteria | మనిషి శరీరంలోని గట్ మైక్రోబయోమ్ (జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా) ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది. ఇది జీర్ణక్రియతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, మెటబాలిజాన్ని సమతుల్యం చేయడం వంటి వాటితో పాటు మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యంలో మార్పులు వస్తే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, కొలొరెక్టల్ క్యాన్సర్ తో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక మరణాలకు కారణం హృదయ సమస్యలే. ధూమపానం, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి అంశాలన్నీ కూడా హృదయ వ్యాధులకు కారణమవుతాయి. అయితే తాజా పరిశోధనలు జీర్ణాశయంలోని సూక్ష్మజీవుల సమతుల్యం కూడా హృదయ వ్యాధులను అభివృద్ది చేయడంతో పాటు వ్యాధి ముందుకు సాగే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అధ్యయనాల ద్వారా తెలియజేస్తున్నారు.
జీర్ణాశయం, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న ఈ కొత్త సంబంధాన్ని గట్ – హార్ట్ ఆక్సిస్ అని పిలుస్తున్నారు. జీర్ణాశయంలోని బ్యాక్టీరియాతోపాటు చాలా మంది తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో గట్ మైక్రోబయోమ్ నిర్మాణం ఆరోగ్యవంతుల కంటే భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో సూక్ష్మజీవుల వైవిధ్యం తగ్గిపోవడం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా తగ్గిపోవడం, వాపులకు కారణమయ్యే సూక్ష్మజీవులు పెరగడం వంటి లక్షణాలు కనిపించడంతోపాటు మైక్రోబయోమ్ ఆరోగ్యం క్షీణించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 6వేల మందికి పైగా గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులతో పోల్చినప్పుడు వారిలో అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, ఆట్రియల్ ఫిబ్రిలేషన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె వైఫల్యం, స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు.
అలాగే హృదయ సమస్యలు ఉన్న వారిలో ఫైబర్ జీర్ణ ప్రక్రియ బ్యాక్టీరియా అయిన ఫేకాలి బ్యాక్టీరియా తక్కువ స్థాయిలో ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మనిషి తినే ఆహారాన్ని జీర్ణాశయంలోని సూక్ష్మజీవులు చిన్న అణువులుగా విభజిస్తాయి. ఈ ప్రక్రియలో మెటబోలైట్స్ అనే పదార్థాలు తయారవుతాయి. ఇవి కొన్నిసార్లు శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు ఇవి అధికంగా ఉంటే హానికరం కూడా కావచ్చు. గట్ మైక్రోబయోమ్, హృదయ వ్యాధి మధ్య ఉన్న బలమైన సంబంధాల్లో TMAO (Trimethylamine N-oxide) అనే మెటబోలైట్ ఒకటి. ఎర్ర మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను సూక్ష్మజీవులు విభజించినప్పుడు TMA (Trimethylamine) తయారవుతుంది. ఇది లివర్ లో TMAO గా మారుతుంది. TMAO స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పనిశోధకులు తెలియజేస్తున్నారు.
అలాగే జీర్ణాశయంలోని బ్యాక్టీరియా తయారు చేసే అన్ని పదార్థాలు హానికరం కావు. కొన్ని హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇందులో ముఖ్యమైనవి ఇండోల్స్. ఇవి ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లాన్ని గట్ బ్యాక్టీరియా ఆహారాన్ని విభజించినప్పుడు తయారవుతుంది. ఇది మానసిక స్థితి మెరుగుపరచడం, నిద్ర, ఆకలి నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గట్ సూక్ష్మజీవులు హృదయ వ్యాధిని ప్రభావితం చేస్తున్నాయని తెలిసిన తరువాత పరిశోధకులు నివారణ, చికిత్స విధానాల గురించి కూడా ఆలోచిస్తున్నారు. గట్ మైక్రోబయోమ్ ఫింగర్ ఫ్రింట్ ద్వారా లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తించవచ్చు. అలాగే ప్రోబయోటిక్స్ ద్వారా హృదయ వ్యాధి అభివృద్దిని నెమ్మదించవచ్చు. ఈ విధంగా గట్ మైక్రోబయోమ్ గుండె ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.