రంగారెడ్డి, మే 3(నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మార్చి 16 నుంచి ఈ నెల 3 వరకు 49 రోజుల్లో రూ.22.51కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.7.95కోట్ల నగదు ఉండగా.. మిగతా మద్యం, డ్రగ్స్, వెండి, బంగారం వంటి ఆభరణాలు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడగా.. మే 13న పోలింగ్ జరగనున్నది. ఈ మధ్యకాలంలో నగదు, మద్యం తదితర రవాణా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. ఓటర్లను ప్రలోభ పెట్టడంలో భాగంగా రాజకీయ పార్టీలు నగదు, మద్యం తదితర వాటిని అక్రమ మార్గంలో తరలించకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్స్ సర్వైలైన్స్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలను ముమ్మరం చేశాయి. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ సైతం ఈ బృందాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతున్నది. జిల్లాకు నలుమూలల ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర జిల్లాల నుంచి నగదు, మద్యం తరలించకుండా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్టీ, వీవీటీ బృందాలు సైతం అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నాయి.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలు నిర్వహించి ఎటువంటి రసీదు లేని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచుతున్నారు. రూ.10 లక్షలకు పైగా డబ్బు పట్టుబడిన సందర్భంలో ఆదాయ శాఖ అధికారులకు సమాచారం అందజేస్తున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించి పట్టుబడిన నగదు, బంగారం, వెండి తదితర వాటిని తిరిగి పొందేందుకు జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు.