న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar)పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అభిశంసన ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా బ్లాక్ పార్టీల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ నేత శతాబ్ధి రాయ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓటర్ల జాబితా సవరణ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆ రాష్ట్రానికి మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి.
సిర్ గురించి బెంగాల్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం పట్ల సీఈసీ జ్ఞానేశ్ ఆగ్రహంగా ఉన్నట్లు తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ బృందంపై సీఈసీ జ్ఞానేశ్ అరిచారని, దీన్ని తాము సీరియస్గా తీసుకోనున్నట్లు టీఎంసీ నేత చంద్రిమ భట్టాచార్య అన్నారు. ఆదివారం కోల్కతా వెళ్లిన ఎన్నికల సంఘం బృందానికి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కాళీఘట్ దర్శనానికి వెళ్లిన సమయంలో సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశౄరు. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ కాళీమాత ఆశీస్సులు రాష్ట్ర ఓటర్లపై ఉంటుందని ఆశిస్తున్నట్లు అన్నారు.