వరంగల్ చౌరస్తా, జూలై 26 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొట్టమొదటిసారి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్)అధికారులు చేపట్టిన తనిఖీలు బంగారు వ్యాపారుల వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్ బులియన్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దానిపైనే చ ర్చలు జరుగుతున్నాయి. హాల్మార్క్ లైసెన్స్ ఉన్న వ్యాపారులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని సాగిన బీఐఎస్ తనిఖీల్లో కేవలం 20 శాతం షోరూముల్లోనే సుమారు రూ. పది కోట్ల విలువైన 8 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఉండాల్సిన నాణ్య తా ప్రమాణం ముద్ర, యూనిట్ ఐడెంటిటీ కోడ్లు లేకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టినట్లయితే పెద్ద ఎత్తున అక్రమాలు బయట పడే అవకాశం ఉంది.
జిల్లావ్యాప్తంగా బంగారు గొలుసుల వ్యాపారంలో ‘సింగ్ ఈజ్ కింగ్’ అని చెప్పుకుంటున్న మండలస్థాయి వ్యాపార వర్గాలను బీఐఎస్ అధికారుల తనిఖీలు పెద్ద కుదుపునకు గురిచేశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బంగారం క్యారెట్ నాణ్యతను బట్టి ఆభరణం అసలు ధర నిర్ణయిస్తారు. ఈ ధరలపై డిస్కౌంట్లు, ఆఫర్ల ద్వారా అమ్మకాలు జరపడం నేరంగా పరిగణిస్తారు. దీని కారణంగానే కొంద రు మండలస్థాయి వ్యాపార వర్గాలతో ఒప్పందాలు కుదుర్చుకొని నకిలీ హాల్మార్క్ ముద్రలను ఆభరణాలపై ముద్రించి అమ్మకాలు జరుపుతూ కమీషన్ వ్యాపారాలు చేస్తున్నారు. ఆభరణంలో అసలు బంగారం ఎంత మొత్తంలో వినియోగించిన విషయం గుర్తించడం అసాధ్యం కాకవడంతో వీరి అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోతుంది. ఇటీవల బీఐఎస్ అధికారుల తనిఖీల్లో కేవలం కొద్దిపాటి వ్యా పారులను మాత్రమే తనిఖీ చేయడం, అసలు అక్రమార్కులపై దృష్టి నిలపకపోవడంతో వారు బంగారు ఆభరణాలను ముందు జాగ్రత్త చర్యగా దొడ్డి దారిన తరలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వినియోగదారుడు మోసపోకుండా నాణ్యమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకునేలా బీఐఎస్ హాల్మార్క్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు పది వరకు ఇవి ఉండగా, వీటి ఏర్పాటుకు ముందే సెంటర్ నిర్వాహకుడి పూర్తి వివరాలతో పాటుగా తన లోగోను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేసిన ప్రతి ఆభరణంపై హాల్మార్క్, యూనిక్ ఐడెంటిటీ కోడ్, ఏ క్యారెట్ నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్న విషయంతో పాటుగా సెంటర్ లోగోను సైతం ముద్రించాల్సి ఉంటుంది.
కానీ సెంటర్ నిర్వాహకులు అవేమీ లేకుండా ఆభరణాలపై ముద్రలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యాపారి నకిలీ ముద్రలు కలిగిన తక్కువ నాణ్యత కలిగిన బంగారంపై ఓ బ్యాంకులో రుణం తీసుకున్న విషయం బయటపడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. ఒకసారి హాల్మార్క్ ముద్రలు వేసిన ఆభరణాలను మరో సెంటర్ నిర్వాహకులు తనిఖీ చేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయంపై అధికారులు దృష్టి పెడితే మాత్రం భారీ మొత్తంలో అక్రమాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు.