ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జ్వరాలతో ప్రజలు మంచం పడుతున్నారు. మలేరియా, డెంగీ, విరేచనాలు, చికున్‌గున్యా లాంటి వ్యాధులు సోకుతున్నాయి. ప్రభుత్వం పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు రోగాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రోగులు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పెద్ద ఆస్పత్రులను ప్రభుత్వం వైద్య విధాన పరిష త్ పరిధిలోకి తీసుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా పేరు మార్చింది. ఈ ఆస్పత్రుల పర్యవేక్షణ పూర్తిగా వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉంటుంది. ఈ దవాఖానలకు ప్రతిరోజూ జ్వరాలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వందలాది మంది చికిత్స కోసం వస్తున్నా.. వారికి రోగానికి తగ్గ మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దాదాపుగా అన్ని దవాఖానల్లోనూ మందులు నిండుకున్నా యి. ఆస్పత్రి సూపరింటెండెంట్లు మం దులను సరఫరా చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. అలాగే, పలు ఆస్పత్రు ల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయడంలేదని.. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేయించుకోవాలని అక్కడి సిబ్బంది సూచిస్తున్నారని రోగులు పే ర్కొంటున్నారు. అదే విధంగా ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడంలేదని రోగులు వాపోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గం టల వరకే డాక్టర్లు అందుబాటులో ఉం టారని, 5 గంటల తర్వాత వచ్చే రోగులకు స్టాప్ నర్సులే వైద్యం చేస్తున్నారని.. ఎమర్జెన్సీతో వచ్చే వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోపిడీ చేస్తున్నాయని పలువు రు పేర్కొంటున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నది. గ్రామాల్లో పీహెచ్సీ డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఆర్ఎంపీ డాక్టర్ల ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు రోగులను టెస్టుల పేరుతో నిండా ముంచుతున్నారు. అవసరం లేకపోయినా ఆస్పత్రు ల్లో అడ్మిట్ చేసుకుని వచ్చీరాని వైద్యం చేస్తుండడంతో వ్యాధి తీవ్రత మరింత పెరిగిన తర్వాత తీరిగ్గా పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో టెస్టులు, మందులకు రూ. లక్షల్లో చెల్లించాల్సి రావడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో సుమారు 140 వరకు ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో ఇబ్రహీంప ట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, షాద్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, యాచారం, చేవెళ్లలో కమ్యూని టీ హెల్త్ సెంటర్లున్నాయి. అలాగే, జిల్లా లో 30 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, అర్బన్ ఆస్పత్రులు 25, బస్తీ దవాఖానలు 76వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదనే ఆరోపణలున్నాయి. మందుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నది. ప్రతిరోజూ వచ్చే రోగులకు ఆశించిన స్థాయిలో వైద్యం అందడంలేదని రోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండకపోవడంతో నర్సులే వైద్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించిన సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్యసేవలను మరింత మెరుగు పర్చాలని రోగులు కోరుతున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకుపోవడంతో దోమల వ్యాప్తి పెరిగి ఒక్కసారిగా రోగాలు పెరుగుతున్నాయి. తాండూరులోని జిల్లా ఆసుపత్రితోపాటు వికారాబాద్, కొడంగల్, పరిగి ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగులు గత నెల రోజులుగా క్యూ కడుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ దవాఖానలూ రోగులతో నిండిపోతున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ఏడాది కూడా డెంగీ బారినపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. డెంగీ కేసులు 69 నమోదుకాగా, ఫీవర్ కేసులు గత నెల రోజుల్లో 6,300, మలేరియా కేసు ఒకటి నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రోజుకు 150-200 ఫీవర్ కేసులు నమోదవుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నారని పలువురు మండిపడుతున్నారు. పంచాయతీల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల నిర్వహణకు ఇప్పటివరకు రూపాయీ విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పలు పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజూ రోడ్లు, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయగా.. ప్రస్తుతం వాటి ఊసే లేదు. పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఏడాదికిపైగా జీతాలు లేకపోవడంతో వారు పారిశుధ్యం నిర్వహణపై శ్రద్ధ చూపడం లేరు. మరోవైపు గ్రామాల్లోని డ్రైనేజీ పైప్లైన్ల లికేజీల మరమ్మతులూ చేయించకపోవడంతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్ల ఈఎం ఐ చెల్లించకపోవడంతో, డీజిల్‌కూ డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పంచాయతీల్లో పూర్తిగా పారిశుధ్యం లోపించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.