రంగారెడ్డి, నవంబర్ 3(నమస్తే తెలంగాణ)/షాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో విషాదం నెలకొన్నది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచగా.. వారి బంధువులు, కుటుంబీకులు పెద్దఎత్తున దవాఖానకు చేరుకున్నారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో దవాఖాన మిన్నంటిపోయింది. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. ఇంతలోనే మీకు నూరేళ్లు నిండిపోయాయా అని మృతుల బంధువులు కన్నీరు.. మున్నీరై విలపిస్తుంటే అక్కడ ఉన్నవారందరినీ కలచివేసింది. మృతు ల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. తల్లిని కోల్పోయి కొందరు, తండ్రిని కోల్పోయి మరి కొందరు, కూతుళ్లను కోల్పోయి ఒకరు బాధ లో విలపించారు. తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. తన కూతుళ్లను ప్రయోజకులను చేయాలని పై చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు కన్నీటి గాథే మిగిలింది. కుటుంబీకులు, బంధువుల రోదనలతో దవాఖాన పరిసరాలు మొత్తం మిన్నంటాయి.
బిడ్డలను ప్రయోజకులను చేయాలనుకున్నా..
మాది యాలాల్ మండలం, పెర్కంపల్లి గ్రామం. నాకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురి వివాహం ఈ మధ్యనే చేశా. మిగతా ముగ్గురు కూతుళ్లను హైదరాబాద్లో పై చదువులు చదివిస్తున్నా. బంధువుల వివాహం కోసం రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన నా కూతుళ్లు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతి చెందారు. పై చదువులు చదివించి ప్రయోజకులను చేయాలనుకున్న నా కల కలగానే మిగిలిపోయింది.
– ఎల్లయ్యగౌడ్, మృతురాళ్ల తండ్రి
అసలు ఏమైందో అర్థం కాలే..
చిట్టంపల్లి గేట్ స్టేజీ వద్ద బస్సు ఎక్కాను. ఎక్కిన 10 నిమిషాలకే పెద్ద సౌండ్.. ఏం జరిగిందో అర్థం కాలేదు. కండక్టర్ సీట్ వెనకాల కూర్చున్న. సడెన్గా కంకర మొత్తం బస్సు నిండిపోయింది. దుమ్ముతో ఏం కనిపించని పరిస్థితి, విండోలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నా. నేను లేచిన గడియ బాగుంది అనుకుంటున్నా.
– ఇటుకాల నర్సింహులు, క్షతగాత్రుడు(ప్రమాద బాధితుడు) అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు
ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారో అర్థం కావడంలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేస్తారే తప్పా రోడ్డు నిర్మాణం చేపట్టరు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇప్పటికైనా రోడ్డు పనులు చేపట్టాలి.
– ఆర్వీరెడ్డి, తాండూర్
భయం..భయంగా ప్రయాణం
హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించాలంటే భయం..భయంగా వెళ్లాల్సి వస్తున్నది. నిధులున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే పనులు ప్రారంభం కాక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సీఎం, స్పీకర్ సొంత నియోజకవర్గాలకు వెళ్లే ప్రధాన రోడ్డు పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఫ్రభుత్వం కండ్లు తెరిచి రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలి.
– అనిల్, అంగడిచిట్టంపల్లి గ్రామం, వికారాబాద్ జిల్లా
ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి..
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేయడం.. ఆ తర్వాత మర్చిపోవడం సార్వసాధారణమైంది. దీంతో సామాన్యు ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇది ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలూర్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఏడాది గడవక ముందే మరో పెద్ద ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు పోకుండా బీజాపూర్ హైవేను విస్తరించాలి.
– రాఘవేందర్, ఆలూర్ గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
వెంటనే రోడ్డు పనులు చేపట్టాలి
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం, అధికారులు మొద్దు నిద్రనే. ప్రమాదాలు జరుగు తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఎమ్మెల్యే యాదయ్య, ప్రభు త్వం చొరవ తీసుకొని బీజాపూర్ హైవేను విస్తరించాలి.
– అనంతరాములు, ఆలూర్ గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. 
బీజాపూర్ హైవే విస్తరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడం దారుణం. రోడ్డును విస్తరించి ఉంటే 19 మంది మృతి చెందేవారే కాదు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం అమానుషం. ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి.
– వెంకటేశ్, మీర్జాగూడ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా