బొంరాస్‌పేట, జూన్ 11: నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్‌బై చెప్పి బడిబాట పట్ట నున్నారు. మూలకు పడేసిన పుస్తకాల బ్యాగులను, టిఫిన్ బాక్సులను దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవ త్సరం విద్యా ర్థులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా బడులు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి నోట్ బుక్కు లను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసి అమలు చేయనుంది. కొత్తగా విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందజే యను న్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశా లలను తీర్చి దిద్దడానికి ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతి సదుపాయాలను కల్పించింది. దీంతో సర్కారు బడులు సరికొత్తగా దర్శనమివ్వనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ ఈ నెల మూ నుంచి బడిబాట చేపట్టగా, సర్కారు బడుల్లో అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా యూనిఫాం, నోట్‌బుక్కులు, పాఠ్య పుస్తకాలు అంద జేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు.
పంపిణీకి సిద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం
వికారాబాద్ జిల్లాలో 1097 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 6,28,452 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేయగా జిల్లాకు ఇప్పటి వరకు 5,74,010 పాఠ్య పుస్తకాలు వచ్చాయి. మిగతా పాఠ్య పుస్తకాలు కూడా త్వరలో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు సరఫరా చేయగా సీఆర్పీలు మండలాల్లోని పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేశారు. విద్యార్థులకు అందజేసే రెండు జతల యూనిఫాంను కూడా బడులు తెరిచే రోజే అందించాలన్న లక్ష్యంతో గత విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే యూనిఫాంకు కావాల్సిన వస్ర్తాన్ని విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని మండలాలకు పంపించారు. యూనిఫాం కుట్టడానికి వస్ర్తాన్ని హెచ్ఎంలు టైలర్లకు అందజేశారు. ఇప్పటి వరకు 80 శాతం యూనిఫాం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం విద్యార్థులకు ఒక జత అందజే యడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాకు 4,80,792 నోటు పుస్తకాలు అవరంకాగా ఇప్పటి వరకు 37 వేల నోట్ పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వీటిని కూడా విద్యార్థులకు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మధ్యాహ్న భోజనంలో మార్పులు
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రతి సోమవారం కిచిడీ, ప్రతి గురువారం విజి టెబుల్ బిర్యానీ అందించనున్నారు. దీంతోపాటు విద్యార్థులకు ఈ విద్యా సంవత్స రం నుంచే అల్పాహారంగా రాగిజావను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన దీనిని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హాజరు శాతం పెంపునకు బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1వ తరగతిలో 4278 మంది విద్యార్థులు బడి బాటలో చేరారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 371 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేశారు. వీటిలో చాలా పాఠశాలలను ప్రారంభించగా ఇంకా 38 పాఠశాలలను ప్రారంభించాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి బడిగంట మోగ నున్నది. వేసవి సెలవులు ఆదివారంతో ముగియగా.. విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ పాఠ శాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు బడుల విద్యార్థుల కోసం యూనిఫాం, పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఈ నెల 20న యూనిఫాం, నోటు పుస్త కాలు అందజేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అదేరోజు విద్యా దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నది. జిల్లాలోని 148 పాఠ శాలల్లో రీడింగ్ లైబ్రరీ కార్నర్లు సిద్ధం చేసింది. విద్యా దినోత్సవాన్ని పుర స్కరించుకుని రీడింగ్ లైబ్రరీల ప్రారంభోత్సవం చేయనున్నది. ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించ నున్నారు. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 14న ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయనున్నట్టు ప్రధానోపాధ్యాయుడు పరమేశ్ తెలిపారు. సోమవారం నుంచి పాఠశాల తెరుచుకోనుండటంతో బడిని ముస్తాబు చేశామని చెప్పారు.విద్యార్థులను ఆకట్టుకునేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని ఆయన తెలిపారు.
సిద్ధంగా పాఠ్య పుస్తకాలు …
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం అవు తున్న సందర్భంగా మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడానికి పాఠశాలల్లో సిద్ధంగా ఉన్నాయి. యూనిఫాం కూడా అన్ని పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సద్ధంగా ఉన్నాయి. సోమవారం మొదటి రోజు విద్యార్థులకు పాఠ్య పుస్త కాలతో పాటు ఒకజత యూనిఫాం కూడా అందజేయాలని హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చాం. జిల్లాలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చేసిన 371 పాఠ శాలల్లో ఇంకా 38 పాఠశాలలను ప్రారంభించాల్సి ఉంది. వాటిని కూడా ప్రారం భిస్తాం. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా బడిబాట నిర్వ హించాం. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను చేర్పిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సర్కారు బడులను బలోపేతం చేయాలి. -రేణుకాదేవి, డీఈవో వికారాబాద్