కడ్తాల్, సెప్టెంబర్ 21 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోటీలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులచే ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించాలన్నారు.
జోనల్ కార్యదర్శి భీముడునాయక్ మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు అండర్-14, అండర్-17 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మాధవి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సీఐ శివప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, ఏంఈవో నాయక్, హెచ్ఎం జంగయ్య, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, జోనల్ సెక్రటరీ భీముడునాయక్, పీడీలు, విద్యార్థులున్నారు.