ఇబ్రహీంపట్నం, మార్చి 7 : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు, కరెంటుకోత, నీటి ఎద్దడి ఏర్పడ్డాయని గంథాలయ సంస్థ జిల్లా మ్రాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరణ జరపాలని కోరుతూ.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేండ్లలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏనాడు కరవు ఛాయలు కనిపించలేదని, 24గంటల ఉచిత విద్యుత్‌తో పాటు మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే కరెంటు కోతలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు తాగునీటి కోసం మహిళలు రోడ్లెక్కె పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్‌పార్టీ అనేక హామీలిచ్చిందని, ఏఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయటంలేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఫార్మాసిటీపై కూడా నేటికి ఓ స్పష్టత రాకపోవటంతో ఈ ప్రాంత అభివృద్ధి మరింత కుంటుపడుతుందన్నారు.
సమావేశంలో ఎంపీపీ కృపేశ్, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, రమేశ్, కిషన్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు మహేశ్‌గౌడ్, జంగయ్య, శంకర్, సుధాకర్, యాదయ్య, రాజు, వీరేశ్, రాజ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, జగదీశ్, సురేశ్, గణేశ్, యాదగిరి, శ్రీణివాస్రెడ్డి, మహేష్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.