పెద్దఅంబర్‌పేట, మే 16 : నిత్యం చెత్తను తొలగించే పారిశుధ్య కార్మికులను చీపురు కష్టాలు వెం టాడుతున్నాయి. విలీన మున్సిపాలిటీల్లో దాదాపు ఏడు నెలలుగా చీపురు కట్టలకు కాసులు రాకపోవడంతో వారికి ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సగం విరిగిన చీపుర్లతో పని కానిస్తుండగా.. ఎక్కువగా వంగి పనిచేస్తుండడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు డివిజన్ల పరిధిలో 250 మందికిపైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికురాలికి నెలకు ఆరు వరకు చీపురు కట్టలు అందిస్తారు. ఈ లెక్కన 250 మందికి నెలకు 1,500 అవసరం. దాదాపు ఏడు నెలలకుగాను ఈ రెండు డివిజన్ల పరిధిలోనే 10,500 వరకు చీపురు కట్టలు కావాలి. కానీ, ఏడు నెలలగా ఒక్కటంటే ఒక్కటి కూడా అందలేదు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అయినప్ప టి నుంచి వీరికి చీపురు కట్టలు రావడంలేదు. ఫలితంగా పనులు ముందుకు సాగడం కష్టంగా మా రిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సొంత డబ్బుతో చీపుర్లు కొనక తప్పడంలేదని అంటున్నారు.
రెండు డివిజన్ల పరిధిలో దాదాపు ఏడుగురు జవాన్లు పనిచేస్తున్నారు. వీరు పారిశుధ్య కార్మికుల పనితీరును పరిశీలిస్తారు. చీపురు కట్టలు ఇవ్వకపోతే చెత్తను ఎలా ఊడుస్తామని పలుమార్లు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా రు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని పేర్కొంటున్నారు. చీపురు కట్టలకు పైసలు ఇవ్వడంలేదని నాగోల్ సర్కిల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికు లు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండుసార్లు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి నిరసన తెలిపా రు. అయినా చీపుర్లకు పైసలు రాలేదని, పనులు ఎట్లా చేసేదని మండిపడుతున్నారు.