గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడుదలయ్యే నిధులతో సర్పంచ్లు, అధికారులు గ్రామాల్లో రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయించేవారు. కానీ.. ఐదు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు రూపాయి కూడా కేటాయించకపోవడంతో పాలన పడకేసింది.
ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులకు కొన్ని నెలలుగా ప్రభుత్వం జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారు పనుల నిర్వహణపై శ్రద్ధ పెట్టడంలేదు. దీంతో ఇండ్ల మధ్యే చెత్తాచెదారం పేరుకుపోతున్నది. మురుగుకాల్వలు నిండి రోడ్లపై మురుగు పారుతుండడంతో ప్రజలు వాసనను భరించలేకపోతున్నారు. నిధుల లేమితో డ్రైనేజీ పైప్లైన్ల లీకేజీల మరమ్మతులనూ చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది.
కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికెళ్లి తడి, పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను మంజూరు చేయగా వాటి నిర్వహణ ఖర్చులు, డీజిల్, మరమ్మతులకు డబ్బుల్లేక మూలనపడ్డాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించింది. రానున్నది వానకాలం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య పనులు చేపట్టకుంటే రోగాలు ప్రబలే అవకాశం ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గ్రామాలకు నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– వికారాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ)
ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోవడంతో పల్లెల్లో ప్రగతి కుంటుపడింది. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందడంలేవు. వేతనాలు చెల్లించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోతున్నది. రానున్నది వర్షాకాలం కావడంతో పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వెంటనే నిధులను కేటాయించాలి. లేకుంటే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నది.
– చాకలి అంజిలయ్య, బొంరెడ్డిపల్లి, కులకచర్ల

పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పైసా కూడా విదల్చలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రత్యేక అధికారులు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలకు మౌలిక వసతులు సమకూరడంలేదు. పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తున్నది. మురుగు కాల్వలు శుభ్రంగా లేకపోవడంతో ఈగలు, దోమలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలి.
– తుప్పుడు శేఖర్, సిరిగిరిపేట, తాండూరు రూరల్
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పల్లెలు పచ్చబడి పరిశుభ్రం గా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించేవారు. దీంతో సర్పంచ్లు, అధికారులు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించేవారు. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పంచాయతీల అభివృద్ధికి రూపాయి కూడా విదల్చలేదు. దీంతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందిపడుతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్గాంధాన్ని భరించలేకపోతున్నారు. మ్యాన్హోళ్ల మూతలు పగిలిపోయి మురుగు రోడ్లపై పారుతున్నది. ఇకనైనా పాలకులు స్పందించి నిధులు విడుదల చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలి
– చాకలి రాములు, పెద్దేముల్
గ్రామాల్లో చెత్త సేకరణ సరిగ్గా జరుగడంలేదు. అధికారులను సంప్రదిస్తే పంచాయతీలో నిధుల్లేవు రాగానే పనులను ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీంతో గ్రామం లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిశుభ్రత లోపిస్తున్నది. రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి.
– చంద్రశేఖర్రెడ్డి, ఐనెల్లి, తాండూరు రూరల్
గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగిసి ప్రత్యేక అధికారులు రావడంతో పారిశుధ్యం పడకేసింది. నిధుల లేమితో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా సాగడంలేదు. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోతున్నది. దీంతో దోమలు, ఈగల మోత పెరు గుతున్నది. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి.
– రాజు బ్రాహ్మణపల్లి, దోమ
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెలు స్వచ్ఛతకు నిల యాలుగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులను కూడా పొందాయి. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తున్నది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయి కంపుకొడుతున్నది. ఐదునెలలైనా రేవం త్ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గుర వుతున్నారు. పంచాయతీ కార్మికులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో వారు బయట అప్పులు తెచ్చుకుని బతుకు బండిని లాగిస్తున్నారు.
– మామిళ్ల వెంకట్, పెద్దేముల్
ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు పెండింగ్లో పడుతున్నాయి. మౌలిక వసతులు కూడా సమకూరడంలేదు. దీంతో మహిళలు తాగునీటికి, రాత్రివేళల్లో వీధిలైట్లు వెలుగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిధుల కొరతతో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. వర్షాకాలం సమీపిస్తుండడంతో వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గాలు లేక, ఇంకోవైపు నిధుల్లేక పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
– యాదప్ప, కొర్విచేడ్, బషీరాబాద్