సిద్దిపేట, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టారు. భూ భారతి పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500 మంది విద్యావంతులను లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి.. తీరా ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత, ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, గౌరవ వేతనం వస్తుందన్న ఆశతో అప్పటికే చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి స్వయంగా వారికి మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారని.. కానీ పనుల్లోకి చేరాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. వారికి కనీస వేతనం ఇవ్వకుండా.. సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం పది రూపాయల కమీషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని అన్నారు. ఎకరం సర్వే చేస్తే పది రూపాయలంటే వీరు ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవలం రూ. 20 వేలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇదేనా రేవంత్‌రెడ్డి యువతకు ఇచ్చే ఉపాధి? అని ప్రశ్నించారు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గత ఏడాది కాలంగా ఎలాంటి జీతం లేక, సరైన పనికల్పించకపోవడంతో 6,500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం వారి జీవితాలతో ఆడకుండా.. ఇచ్చిన మాట ప్రకారం వారికి తక్షణమే గౌరవ వేతనం ఇవ్వాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతాం
రేవంత్ సర్కార్ జర్నలిస్టులకు మొండిచే యి చూపడమేగాక చిన్నచూపు చూస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి గెలిచా క వారి గుండెలపై తన్నినట్టు చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వారికి అక్రెడిటేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితిలో సర్కార్ ఉన్నదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులతోపాటు జర్నలిస్టుకు హెల్త్ సీమ్‌లో భాగస్వామ్యం చేశామని, ప్రస్తుతం జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ నుంచి దూరం చేయడం దురదృష్టకరమని అన్నారు. వారి సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల కోసం కేటాయించిన రూ.16 కోట్లలో రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఒక్క అక్రెడిటేషన్ కార్డు తగ్గించినా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 5 టోర్నీని ప్రారంభించిన హరీశ్‌రావు.. బ్యా ట్పట్టి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు.