బాన్సువాడ, ఆగస్టు 5: విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. జ్వరాలు, దగ్గు, జలుబు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో తీవ్రమైన రద్దీ కనిపిస్తున్నది. సాధారణ రోజుల్లో ఉండే ఔట్ పేషెంట్ (ఓపీ) సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 30 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇన్ పేషెంట్ వార్డుల్లోని బెడ్లు దాదాపు ఖాళీగా ఉండడం లేదు.
కామారెడ్డి జిల్లాలో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లోని ప్రభుత్వ దవాఖానాలకు రోగుల తాకిడి బాగా పెరిగింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గడం, విపరీతమైన జ్వరం, వాంతులు, వీరేచనాలు, దగ్గు, జలుబు వంటి వాటితో బాధ పడుతూ దవాఖానలకు పరుగులు పెడుతున్నారు. బాన్సువాడలో నిత్యం దాదాపు 900 మంది దాకా బాధితులు ఓపీ కోసం క్యూ కడుతున్నారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 500-600 వరకు ఓపీ ఉంటుంది. ప్రస్తుతం అది బాగా పెరిగింది. ఇక కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, గ్రామాల్లో ఆర్ఎంపీల వద్ద చికిత్స పొందే వారికైతే లెక్కే లేదు. మరోవైపు, బాధితుల్లో కొందరికి డెంగ్యూ అనుమానిత లక్షణాలు కనిపిస్తుండడంతో సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఓపీ విభాగమే కాదు, ఇన్పేషెంట్ విభాగంలోనూ రద్దీ పెరిగింది. సీజనల్ వ్యాధులతో బాధ పడుతున్న వారిలో చాలా మంది దవాఖానల పాలవుతున్నారు. వాంతులు, విరేచనాలు, మలేరియా, డయేరియా, విషజ్వరాలు కేసులు బాగా పెరిగాయి. గత నెలలో ఒక్క బాన్సువాడలోనే 590 మంది డయేరియా బాధితులు చికిత్స పొందడం గమనార్హం. మిగతా చోట్ల కూడా పెద్ద మొత్తంలో రోగులు చేరారు. ఇక, ప్రైవేట్ దవాఖానలు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు, ఇద్దరు జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారు.
ప్రస్తుత వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. భారీ వర్షాలకు తోడు వాతావరణ మార్పులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అటు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఎండ వేడిమి ఎక్కువగా ఉంటున్నది. రెండు రకాల వాతావరణంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక, ఇండ్ల పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండడం, చెత్తాచెదారం పడేయడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. ఇవి వైరల్ జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అపరిశుభ్రమైన పరిసరాలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్ , డయేరియా వంటి కేసులు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాచి వడబోచిన నీటిని తాగాలని, తాజా ఆహారాన్ని తీసుకోవాలని, బయట దొరికే చిరుతిండ్లను కొద్ది రోజులు దూరం పెట్టాలని పేర్కొంటున్నారు. తీవ్ర అలసట, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని, కానీ ఇష్టమొచ్చిన మాత్రలు వేసుకోవద్దని, ప్రధానంగా యాంటీ బయోటిక్స్ అధికంగా వాడొద్దని సూచిస్తున్నారు
ప్రస్తుత వర్షాలకు తోడు వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి. వైరల్ ఫీవ ర్ ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు వ్యాధులను నియంత్రించవచ్చు. చికిత్స కన్నా నివారణ మార్గాలే మేలు.
– డాక్టర్ వెంకట్, డీఎంహెచ్వో, కామారెడ్డి