పులకించి ప్రణమిల్లి..నేడు గద్దెపైకి తల్లి సమ్మక్క
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగు నుంచి సమ్మక గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి10:47 గంటల తర్వాత గద్దెలపైకి చేర్చారు.
- తనువెల్లా కనులై ఎదురుసూడంగ.. బిడ్డ సారలమ్మ రాక
- వెన్నెల వెలుగుల్లో గద్దెపై కొలువుదీరిన కన్నెపల్లి కల్పవల్లి
- తన్మయత్వంతో పొంగిపోయిన భక్తకోటి
- జంపన్నవాగులో ఉప్పొంగిన జనప్రవాహం
- నేడు గద్దెపైకి తల్లి సమ్మక్క
దారులన్నీ ఏకమై.. భక్తజన ప్రవాహమై.. తరలివచ్చిన తనువులెల్లా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుసూడంగ..కోరిన కోర్కెలు తీర్చి.. కష్టాలు కడతేర్చి..సల్లంగ సూడాలని కోరిమొక్కంగ..కడుపు పండాలని ఆడబిడ్డలు కొంగు పట్టంగ..కరుణించాలని తడిబట్టలతో వరం పట్టంగ..తన్మయత్వంతో వేలాదిమంది సాష్టాంగ పడంగ..పూనకాలతో శివసత్తులు శివాలూగంగ..జంపన్న సాక్షిగా భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కంగ..ప్రపంచమే పులకించి ప్రణమిల్లంగ..మాఘశుద్ధ వెన్నెల వెలుగుల్లో కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ కదలివచ్చింది..వనంలో ఘనమొక్కులందుకోను గద్దెపై బుధవారం కొలువుదీరింది. తల్లి సమ్మక్క నేడు తరలిరానుండగా అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.
తాడ్వాయి, ఫిబ్రవరి 16 : కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగు నుంచి సమ్మక గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి10:47 గంటల తర్వాత గద్దెలపైకి చేర్చారు.
లక్షలాది మంది తన్మయత్వం
నాలుగు కిలో మీటర్ల మేర సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది పోటీ పడుతూ తన్మయత్వం చెందారు. ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మ పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో ఉప్పొంగింది.
నేరుగా సమ్మక్క పూజామందిరానికి..
సారలమ్మ నేరుగా గద్దెలపైకి కాకుండా మేడారంలోని సమ్మక్క పూజా మందిరానికి చేరుకుంది. అప్పటికే అక్కడికి గోవిందరాజు, పగిడిద్దరాజులు చేరుకోగా పూజారులంతా సంయుక్తంగా పూజలు చేసి కట్టు వేసిన అనంతరం సారలమ్మ గద్దెపైకి చేరుకొని తల్లిని ప్రతిష్టించారు. కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారుల బృందం సారలమ్మను తీసుకువచ్చారు.
స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు
సారలమ్మకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఘన స్వాగతం పలికారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో సారలమ్మ గద్దెలపైకి చేరింది. ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ పర్యవేక్షణలో రోప్‌పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ పోలీసులు తాడు వలయంగా ఏర్పడి భద్రత కల్పించారు.
వనమంతా ప్రభం‘జనం’
సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురాగా మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు జనప్రభంజనాన్ని తలపించాయి. జంపన్నవాగు జనంతో పోటెత్తింది. మొకులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారులు కికిరిసిపోయాయి. సారలమ్మ గద్దెపైకి రాగానే పరవశంతో దర్శనం కోసం ఒకసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. క్యూలైన్లలో బారులు తీరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

