రంగారెడ్డి, మే 16 (నమస్తే తెలంగాణ): ధాన్యానికి బోనస్‌పై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యి చ్చింది. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారు. కేవలం సన్న రకం వడ్లకే చెల్లిస్తామని మోసం చేశారు. ‘ఓట్ల ముందు ఓడమల్లన్న ..ఓట్లయ్యాక బోడి మల్లన్న’ అన్నట్లుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే నాలుక మాడతేయడంపై కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ మరోసారి పిడికిలెత్తింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో గులాబీ దళం రైతులకు బాసటగా నిలిచింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, షాద్‌నగర్, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి గురువారం నిరసనలు చేపట్టారు. రైతు వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. మహేశ్వరంలో ని ర్వహించిన నిరసనలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులను మరోసారి కాంగ్రెస్ వంచించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధారూరు మండలం, గట్టెపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. సన్న, దొడ్డు అనే తేడా లేకుండా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశా రు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, తాండూరు మం డలంలోని చెంగోల్‌లో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజూగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో వ్యవసాయ రంగం అగమ్యగోచరంగా మారింది. సాగునీటి వనరుల్లో నీరు అడుగంటి కరువు తాండవించింది. పంటలకు తడి అందక ఎండిపోయి పశువులకు మేతగా మారింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు సైతం వచ్చే పరిస్థితి లేక రైతుల కష్టం బుగ్గిపాలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరువు అనే మాట లేకపోగా..కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కష్టాలు రైతులను వెక్కిరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా, రుణమాఫీ హామీలిచ్చి రైతులను నమ్మించిన కాంగ్రెస్.. మాట నిలుపుకోకపోవడంతో రైతు కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చేతికొస్తున్న కొద్దిపాటి పంటలను సైతం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతాంగం అష్టకష్టాలు పడుతున్నది. ఓ వైపు సాగు కష్టాలు, మరోవైపు కరెంట్ కోతలతో పదేండ్లుగా మాయమైపోయిన రైతు కష్టాలు నేటి కాంగ్రెస్ పాలనలో మళ్లీ ప్రత్యక్షమై రైతు బతుకులను ఛిద్రం చేస్తున్నాయి.
రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం పండిన ప్రతి గింజనూ కొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ధాన్యా న్ని అమ్ముకోవడం రైతులకు సవాల్‌గా మారింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యా న్ని కొనేందుకు కొర్రీలు పెడుతుండడంతో విధిలేక రైతులు వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటున్నారు. యాసంగిలో పంటలు ఎండిపోగా..పండిన కాస్తంత పంటకైనా బోనస్ ఇచ్చి ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఎన్నికల నాటి హామీయే అయినా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిశాక..సీఎం రేవంత్ రైతులకు చావు కబురును వినిపించారు. కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి రైతుల్లో కొద్దిపాటిగా మిగిలిన ఆశపై నీళ్లు చల్లారు. సీఎం మాటలతో బోనస్ హామీ బోగసేనని తేలిపోయిందని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సన్న రకం వడ్లకు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వడ్లకు ఇవ్వకుంటే రైతుల పొట్టకొట్టినట్లేనని అన్నదాతల కుటుంబాలు, రైతు సంఘాల ఆవేదన చెందుతున్నాయి. గురువారం మహేశ్వరం, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి సన్న రకం వడ్లతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇస్తామని ప్రకటించే వరకూ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.
మహేశ్వరం గేట్ వద్ద శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సన్న రకం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను వంచించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని, వరి ధాన్యానికి క్విం టాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి..పార్లమెంట్ ఎన్నికలు కాగానే సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పి రైతులను దగా చేశారన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం సన్న వడ్లకే బోనన్ ఇస్తామనడం.. ఇంతకంటే మోసం మరొకటి లేదన్నారు. సన్నరకం వడ్లకే ఇస్తామని ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించేవారని, ఇప్పటికీ రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతోనే ఉన్నారన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనకుండా రైతులను ఈ సర్కారు గోస పెడుతున్నదన్నారు.