కోల్‌కతా: సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్‌కు అర్హత సాధించగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. బుధవారం నుంచి మొదలుకానున్న నాకౌట్ దశలో భాగంగా.. బుధవారంనాడు రాత్రి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్ వేదికగా తొలి సెమీస్ ఆడనున్నాయి. టోర్నీలో పడుతూ లేస్తూ ఆడుతున్న కివీస్.. ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన సఫారీలను ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం.
సఫారీలు.. ఆల్ ఫిట్
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో పాటు తమకు ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడించిన దక్షిణాఫ్రికా.. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అతడు 7 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 53.60 సగటుతో 268 రన్స్ చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసినవారిలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. సఫారీ కెప్టెన్‌ను అడ్డుకోవడమే కివీస్ బౌలర్ల ముందున్న సవాల్. డికాక్ అంచనాలు అందుకోలేకపోతున్నా మూడో స్థానంలో వచ్చే రికెల్టన్ (7 మ్యాచ్‌ల్లో 228), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ వరకూ ఆ జట్టుకు దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరిలో ఏ ఒక్కరు నిలిచినా మ్యాచ్‌ను ఒంటిచేత్తో తమ వైపునకు తిప్పుకోగల సామర్థ్యం ఉన్నవాళ్లే. ఇక మార్కో యాన్సెన్ (5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు), కార్బిన్ బాష్ (6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) పేస్ ఆల్రౌండర్లుగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రూపంలో కివీస్‌కు ముప్పు తప్పకపోవచ్చు. స్లో డెలివరీలతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న లుంగి ఎంగిడీ (6 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు), తనదైన పేస్‌తో ఆరంభంలోనే దెబ్బకొట్టే కగిసొ రబాడాను నిలువరించకుంటే కివీస్‌కు తిప్పలు తప్పకపోవచ్చు.
స్పిన్నర్లే బలం
న్యూజిలాండ్‌కు స్పిన్నర్లే ప్రధాన బలం. సూపర్-8 దశలో ఆ జట్టు మెరుగ్గా రాణించి సెమీస్ చేరగలిగిందంటే అది స్పిన్నర్ల చలవే. కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌తో పాటు మధ్య ఓవర్లలో స్లో లెఫ్టార్మ్ స్పిన్‌తో మాయ చేస్తున్న రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ సఫారీలను కట్టడిచేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. వీరికి తోడు ఇష్ సోధీ కూడా రాణిస్తే సఫారీ మెరుపు వీరులకు అడ్డుకట్ట వేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే దక్షిణాఫ్రికా టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు (డికాక్, రికెల్టన్, మిల్లర్) ఎడమ చేతి వాటం బ్యాటర్లే కావడంతో లెఫ్మార్ట్ స్పిన్నైర్లెన రచిన్, శాంట్నర్ వారిని ఏ మేరకు కట్టడిచేస్తారనేది ప్రశ్నార్థకం. ఈ నేపథ్యంలో సోధీ, ఫిలిప్స్ కీలకం కానున్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే కివీస్‌కు ఓపెనర్లే అదిపెద్ద బలం. టిమ్ సీఫర్ట్ (6 మ్యాచ్‌ల్లో 216 రన్స్), ఫిన్ అలెన్ గనుక పవర్ ప్లేలో నిలదొక్కుకుంటే సఫారీ బౌలర్లకు కష్టమే. కివీస్‌కు కూడా సఫారీల మాదిరిగానే లోయరార్డర్ దాకా మెరుగైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, శాంట్నర్ కుదురుకుంటే భారీ స్కోర్లు బాదడం పెద్ద విషయమేమీ కాదు
కివీస్‌దే పైచేయి
ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌కు.. దక్షిణాఫ్రికాపై మెరుగైన రికార్డు ఉంది. ముఖ్యంగా నాకౌట్ దశలలో ఆ జట్టుదే పైచేయిగా ఉంది. 2011, 2015 వన్డే ప్రపంచకప్ క్వార్టర్స్‌లలో కివీస్ గెలిచింది. నిరుడు చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లోనూ న్యూజిలాండ్.. 50 పరుగుల తేడాతోవిజయం సాధించింది.
టాస్ కీలకం
ఈడెన్ గార్డెన్లో టాస్ అత్యంత కీలకం. రాత్రి పూట ఇక్కడ మంచు కారణంగా ఫీల్డింగ్ టీమ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. తమ స్కోరును డిఫెండ్ చేసుకోవడం కష్టమే. ఇటీవలే ముగిసిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్ అందుకు తాజా ఉదాహరణ. అందుకే టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.