హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన రెండు వేర్వేరు లా పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారని, ప్రశ్నపత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని వ్యాఖ్యానించారు. ఓయూలో ఫిబ్రవరి 25న ఐదేండ్ల్ల లా కోర్సు, 27న మూడేండ్ల లా కోర్సు పరీక్ష జరిగిందని, ఈ రెండు పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారని విమర్శించారు.
రెండు రోజుల ముందే పరీక్ష జరిగిన పేపర్ మళ్లీ రావడం వెనుక ఉన్న నిర్లక్ష్యానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇదొక నిర్లక్ష్య, బాధ్యతారహితమైన ప్రభుత్వమని, రెండు పరీక్షలకు ఒకే పేపర్ ఇచ్చిన ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి, పరీక్ష ప్రశ్నపత్రాలు సెట్టింగ్ చేసిన అధికారి, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి విద్యాశాఖ పాలన చేతగాకపోతే దిగిపోయి చదువుకున్న వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని హితవుపలికారు.
సర్వశిక్ష అభియాన్ బంకర్బెడ్ల కొనుగోలు అంశంలో రూ.100 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మారెట్ ధర ప్రకారం రూ.60 కోట్లకు రావాల్సిన బంకర్ బెడ్లను రూ.160 కోట్లకు కొనుగోలు చేశారని విమర్శించారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ టెండర్లు కట్టబెట్టడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన చేస్తున్నారా? పరాచకాలు ఆడుతున్నారా? అని మండిపడ్డారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తప్పుల తడకగా ఉన్నదని, ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచే గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను రద్దు చేయాలని సిఫారసు చేయడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఉస్మానియాకు కేటాయించిన రూ. 1,000 కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.