Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షాబాద్ మండలం నరెడ్లగూడలో రూ. కోటి నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జ్యోతిరావుఫూలే, గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంపదను పెంచి ప్రజలకు పంచుతుంటే.. ప్రధాని మోదీ అన్ని ధరలు పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు అన్ని రంగాలపై అపారమైన అవగాహన ఉన్నదన్నారు. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం నయా పైసా ఇవ్వకున్నా కేవలం మూడేండ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరంలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. పెద్ద పెద్ద కంపెనీల ఏర్పాటుతో షాబాద్‌కు మహర్దశ వచ్చిందన్నారు. షాబాద్ పేరును ప్రపంచ పటంలో చూసుకోవడం సంతోషకరమన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారన్నారు.
షాబాద్/చేవెళ్ల రూరల్/శంకర్పల్లి, ఏప్రిల్ 12 : అంబేద్కర్ ఆశయ సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపూర్, చేవెళ్ల మండలం అల్లవాడ, న్యాలట, శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అంబేద్కర్, జ్యోతిరావుఫూలే, స్వామి వివేకానంద, గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం, బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు గుర్తుకొచ్చేలా సెక్రటేరియట్ పక్కన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో పాటు అమరవీరుల స్థూపాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రస్తుత వ్యవస్థ నడుస్తుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసం తెలంగాణలో సుమారు 1000 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 1,150 జూనియర్ కళాశాలలు గురుకులాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 80 నుంచి 90 డిగ్రీ గురుకులాలు, ఐదు పీజీ గురుకులాలు ఏర్పాటయ్యాయన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తున్న ఏకైక సీఎం… కేసీఆర్ అన్నారు. ‘దళితబంధు’తో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడంతో వారు ఉపాధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారన్నారు. సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీకి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. సీతారాంపూర్‌లో పెద్ద పెద్ద కంపెనీలు రానున్నాయని, భూములు ఇచ్చిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్నారు.
జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఈ నెల 14న సెక్రటేరియట్ వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతీ, గోవిందమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు కొత్త పాండురంగారెడ్డి, భీంరెడ్డి, శాంత, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, శోభ, బీఆర్ఎస్ చేవెళ్ల మండల అధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ శంకర్పల్లి మండల అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, మార్కెట్ కమిటీ చైర్మన్లు మిట్ట వెంకటరంగారెడ్డి, పాపారావు, పీఏసీఏస్ చైర్మన్లు చల్లా శేఖర్‌రెడ్డి, శశీధర్‌రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు, నాయకులు కొత్త వాసుదేవ్‌రెడ్డి, డాక్టర్ రాజు, జోగు వెంకటయ్య, రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చెన్నయ్య, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.