బడంగ్ పేట్, మార్చి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు కూతలు మానుకోవాలని, లేకపోతే ప్రజలు ఛీకొడుతారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు నీ మాటలు విరుద్ధంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ను నాలుగున్నర కోట్ల ప్రజలు ఆరాధిస్తుంటే నీవు మాత్రం తిడితే గొప్పవాడిని అవుతానని భ్రమలలో ఉన్నావని మండిపడ్డారు. నీవు మాట్లాడిన మాటలన్నీ జుగు స్సాకరంగా ఉన్నాయన్నారు. పది సంవత్సరాలు కేసీఆర్ పాలన సుభిక్షంగా కొనసాగిందన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం చూపిస్తున్నారని విమర్శించారు.
ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నావని అన్నారు. రైతుల పొలాలు ఎండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని పట్టించుకోకుండ కేసీఆర్ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలకు నీళ్లు ఇవ్వకుండ, సంక్షేమానికి పాత్ర వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు రావడం లేదని, రైతుబంధు పడలేదని ఏ ఒక్క రైతు అడిగిన సందర్భాలు లేవన్నారు. నీవు మాట్లాడుతున్న భాషను చూసి తెలంగాణ ప్రజలు చీపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండ కేసీఆర్, ఆయన కుటుంబంపై మూర్ఖంగా మాట్లాడడం బాధాకరమన్నారు. సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కాక నోరు గాయి చేయడం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కువ కాలం కొనసాగితే ప్రజలకు ప్రమాదాలు తప్పమన్నారు. సావు నోట్లో తలపెట్టి 14 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన అవాక్కులు చివాకులు పేల్చితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ పాలనకు ప్రజలు సమాధి కడతారని ఆమె జోష్యం చెప్పారు. కేసీఆర్ పైన మాట్లాడిన మాటలను వెనకకు తీసుకోవాలని, బే షరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలన ఎలా చేయాలో చేతకాక కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు.