చేవెళ్లటౌన్, ఫిబ్రవరి 4 : రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు మొండ్యాగు అభ్యర్థి దూత మల్లేశ్, ఊరెళ్లలోని 2 వార్డు అభ్యర్థి డప్పు సువర్ణ తరపున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సబితారెడ్డి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మోసపూరిత హామీలనిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. తాగునీరు, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ ఎక్కడ చూసినా కేసీఆర్ నిషానానే కనిపిస్తున్నదని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలలో ఏ రంగాన్ని తీసుకున్నా అధోగతిపాలైందన్నారు. ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇంకా పదేండ్లు సర్పంచ్‌లుగా ఉన్నా అభివృద్ధి కాని గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలిపి ప్రజలను కష్టాల్లోకి నెట్టారని అరోపించారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో ఇప్పుడు నల్లా బిల్లు, ఇంటి టాక్స్‌లు అదనంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, గ్రామాలుగా ఉన్నప్పుడు ఇంటి టాక్స్‌లు తక్కువగా ఉండేవని, ఎవరి స్వార్థం కోసం మున్సిపాలిటీల్లో కలిపారని ప్రశ్నించారు.
ఊరెళ్ల గ్రామంలో ఇప్పటికీ 850 మంది ఉపాధి హామీ పనులకు పోతున్నారని, గ్రామాలను మున్సిపాలిటీలో కలపడంతో ఉన్న ఉపాధి కూడా పోతుందన్నారు. యువతకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి.. కేసీఆర్ ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు ఇచ్చి మళ్లీ ఆ ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి అయితే పత్తా లేదు, రైతు భరోసా 15వేలు వేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపారన్నారు. ఇప్పటివరకు 5 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా ఒకసారి వేసి చేతులు దులుపుకొన్నారని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వర్షం పడితే.. ఇక్కడ రైతు బంధు పడేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులు, యువత, మహిళలను నిర్లక్ష్యం చేయడంతోపాటు ఏ రంగాన్నీ పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చేవెళ్లలోని బృందావని కాలనీలో 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జాహిద్ ప్రచార రథాన్ని, హామీల మేనిఫెస్టోను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, రాజు, రామాగౌడ్ ఊరెళ్ల, మొండ్యాగ్ గ్రామాల ప్రజలు, నాయకులున్నారు.