బడంగ్‌పేట, డిసెంబర్ 23 : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లను సోమవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చాలెంజ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం, నీళ్లు ఇచ్చామన్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ఏ విధం గా ఇస్తున్నామో.. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అందించాలని కేసీఆర్ సంకల్పించారన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి సమ స్యను పరిష్కరించేందుకు భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని కేసీఆర్ ప్రణాళి కను రూపొందించారన్నారు.
పైపులైన్లు వేసేందుకు, రిజర్వాయర్లు నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ.1,200 కోట్లు కేటా యించిందని గుర్తు చేశారు. మూడు దశల్లో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేయ డం జరిగిందన్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయించారని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడానికి రూ.280 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆ నిధులతో పైపులైన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలిపారు. రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరగా.. కొన్ని చోట్ల పనులు పూర్తయినట్లు ఆమె వివరించారు. పాత కాలనీల్లో తప్ప, మిగతా అన్ని కాలనీల్లోనూ పైపులైన్ల పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉండగా.. ఆ సమయంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో గత ప్రభు త్వం వాటిని ప్రారంభించలేకపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నదని ఆమె ఆరోపించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా కూడా వెచ్చించలేదన్నారు.
రిజర్వాయర్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు. ప్రారంభించడానికి మాత్రం శిలాఫలకాలు, బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం గురించి తప్పుగా మాట్లాడే వారు రిజర్వాయర్లను మాత్రం ప్రారంభించడం విడ్డూరం. రిజర్వాయర్లు ప్రారంభించడమే కాదు, ప్రతిరోజూ నీళ్లు కూడా ఇవ్వాలి. పైపులైన్లు వేయని పాత కాలనీల్లో కొత్త లైన్లు వేయించాలి.
నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లను నిర్మించినట్లు ఎమ్మెల్యే సబిత అన్నారు. 50 ఏండ్ల వరకు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 19 రిజర్వాయర్లు నిర్మించినట్లు గుర్తు చేశారు. 29 ఎంఎల్డీ వాటర్ స్టోరేజీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల్లోనూ రిజర్వాయర్లను నిర్మించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ నీటి సమస్య లేదన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, డీఈ జ్యోతి, వినల్ గౌడ్, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామిడి రాం రెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, మర్రి నర్సిరెడ్డి, ఆనంద్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.