రంగారెడ్డి, మే 29 (నమస్తేతెలంగాణ) : ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ నేతల బృందం ఫార్మాసిటీ బాధిత ప్రాంతాల రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఫార్మాసిటీపై ప్రభుత్వం పూటకో మాట మారుస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఆ పార్టీ నాయకులు రైతులకు హామీ ఇచ్చారని అన్నారు.
కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దుచేస్తున్నామని పార్టీ నేతలు ప్రకటించారని, కానీ ప్రభుత్వం మాత్రం ఫార్మాసిటీని అక్కడే నిర్మిస్తామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఫార్మాసిటీని రద్దుచేస్తే వెంటనే ఆ భూములను తిరిగి ఆ రైతులకే అప్పగించి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, స్థానిక శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మా అనుబంధ గ్రామాల్లో పర్యటించి తమ పార్టీని గెలిపిస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను రైతులకే ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటంలేదని విమర్శించారు. ప్రభుత్వం మాట ప్రకారం ఫార్మాసిటీ విషయంలో తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
భూసేకరణ సందర్భంగా కొంతమంది రైతులకు సగం భూములకే పరిహారం అందిందని మిగతా భూములకు కూడా పరిహారం ఇస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని, ప్రభుత్వం మారటంతో మిగులు భూములున్న రైతులకు ఇప్పటివరకు పరిహారం రాలేదని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో పార్మాసిటి భూసేకరణలో పరిహారం అందని రైతులందరికి వెంటనే పరిహారం అందించాలని వారు కోరారు. అలాగే, భూసేకరణలో ఎంతోమంది రైతులు అసైన్డ్ పట్టాలుండి కబ్జాలో ఉన్నప్పటికి వారికి పరిహారం రాలేదని అలాంటి వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఫార్మా బాధిత గ్రామాల్లో రైతులకు వెంటనే న్యాయం చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్పార్టీ రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ ఛైర్మన్ అంబయ్య యాదవ్, మాజీ జడ్పీటీసీ రమేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.