ధారూరు : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌దేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తాండలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రైతులు, మహిళలు, అధికారులు ఆటా పాటలతో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి, పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రైతులను సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు అమలు చేస్తూ ఆదర్శవంతంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
కార్యకర్త కుటుంబాలకు అండగా గులాబీ జెండా..
ధారూరు మండల పరిధిలోని రాంపూర్తాండ గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రూ. 2లక్షల ప్రమాద బీమా చెక్కును వికారాబాద్ ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలు ఆదరువును కోల్పోయి ఇబ్బందులు పడరాదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని అందుకు భరోసాగా కార్యకర్తలకు ప్రమాద బీమా ఏర్పాటు చేశారన్నారు.