– రంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట్, శేర్లింగంపల్లి, హయత్నగర్ మండలాలతోపాటు పలు మున్సిపాలిటీలు విస్తరించి ఉన్నాయని.. ఇక్కడెవరూ వ్యవసాయం చేయడం లేదని.. మొత్తం ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయన్న కారణంతో సర్కారు రైతు భరోసాను నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతోపాటు తుక్కుగూడ, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీల్లో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
అలాగే మిగతా మండలాల్లో కూడా కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అసలు పంటలే సాగు చేయడం లేదనే సాకు చూపి రైతు భరోసాను పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఈ తొమ్మిది మండలాలపై ఎందుకు కక్ష సాధిస్తున్నదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూముల పేరుతో వేలాది ఎకరాలకు రైతు భరోసా నిలిపివేసింది. కొత్తగా మరో తొమ్మిది మండలాలను శివారు మండలాలుగా ముద్రవేసి సాయం నిలిపివేయడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శివారు మండలాల్లోని రైతులందరికీ వెంటనే రైతు భరోసా ఇవ్వాలని అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. శివారు మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున వరి, కూరగాయల పంటలు సాగవుతున్నప్పటికీ వ్యవసాయం చేయడం లేదన్న కారణంతో రైతు భరోసాను నిలిపివేయడం సమంజసం కాదని, రైతు భరోసా నిలిపివేయడం వల్ల 60 వేల మందికి పైగా రైతులు నష్టపోతున్నారని, వెంటనే అర్హులైన రైతులను గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు శివారు మండలాల్లోని రైతు భరోసాకు దూరమైన అన్ని గ్రామాల్లో ఆందోళన చేపట్టాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా తులేకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనకు దిగి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు బీజేపీ కూడా శివారు మండలాల్లోని రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రైతు భరోసాకు దూరమైన రైతులందరినీ కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా నిలిపివేసిన 9 మండలాల్లో సుమారు 60 వేల మంది రైతులు అర్హులని ప్రభుత్వమే గుర్తించింది. ఈ మండలాల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ధ్రువీకరించింది. సుమారు 48 వేల ఎకరాల్లో వరి ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల రికార్డుల్లో ఉన్నా రైతు భరోసాకు నోచుకోవడంలేదు. ఇటీవల శివారు మండలాల నుంచి పెద్దఎత్తున సర్కారు ధాన్యం కొనుగోలు చేసింది. అయినా పెట్టుబడి సాయం అందించడంలేదు.
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం రైతు భరోసాలో ఎక్కడికక్కడే కోత విధిస్తున్నది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న సాకుతో జిల్లాలో 9 మండలాల రైతులకు రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. రైతులు వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నప్పటికీ ఆయా మండలాల్లో సాగు జరగడంలేదని ప్రభుత్వం ప్రకటించడం శోచనీయం. వెంటనే శివారు మండలాల్లోని అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి