వికారాబాద్, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే.. దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా డ్రైవర్, కండక్టర్ల మీద తీవ్రంగా ఒత్తిడి పెరిగిందన్నారు.
కార్మికుల సమ్మెతో కాంట్రాక్ట్ డ్రైవర్లను తీసుకుని ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేయాలన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. 2 పే స్కేల్లను అందించి, యూనియన్ల ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికుల కీలక పాత్ర ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటామన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మెతుకు ఆనంద్, శుభప్రద్‌పటేల్, నాయకులను పోలీసులు అరెస్టు చేసి ధారూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, కౌన్సిలర్ వేణుగోపాల్, నాయకులులున్నారు.

రంగారెడ్డి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రెండు రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు సమ్మెలో ఉండటం వలన బస్సులు బయటకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ డిపోలకు చెందిన సుమారు వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించకపోవడంతో గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపడానికి వస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. కార్మికులకు సంఘీభావం తెలుపటానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం సమంజసం కాదని కిషన్‌రెడ్డి అన్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న కార్మికులు గురువారం పలు డిపోల ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మలతో పాటు పలు నిరసనలు తెలిపారు.