తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సక్సెస్ ఫుల్‌గా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఏటా రెండు పంటలకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ఆదుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో గడిచిన ఐదేండ్లలో రూ.3,009.09 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర సర్కార్ జమ చేసింది.
దీంతో జిల్లాకు చెందిన రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది రైతులు ప్రతి ఏడాది లబ్ధి పొందుతున్నారు. ‘రైతుబంధు’ సాయంతో అన్నదాతలకు అప్పుల తిప్పలు తప్పాయి. దీంతోపాటు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లతో పాటు ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారాన్ని అందజేసి ఆదుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుండడంతో జిల్లాకు చెందిన అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ): గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతంలో రైతులు పంటల సాగుకు, సాగు నీటికి, పంట పెట్టుబడులకు ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు. వానకాలం, యాసంగి పంటల సాగు సమయం వచ్చిందంటే లక్షలాది మంది రైతులు పంట పెట్టుబడుల కోసం ఊర్లలోని పెద్ద కాపు, వడ్డీ వ్యాపారులు, శావుకార్ల చుట్టూ తిరుగుతూ, తమ వద్దనున్న విలువైన వస్తువులు, వెండి, బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి నానా కష్టాలు పడేటోళ్లు. తెచ్చిన అప్పులతో పంటలు సరిగా పండక, చేసిన అప్పులను రైతులు తీర్చలేక వడ్డీలతో విపరీతంగా కుంగిపోయేటోళ్లు. కానీ నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకువచ్చారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత
గత పాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు రైతుల కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయంలో నష్టాలను చవిచూస్తూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయి. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో అప్పటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తన కేబినెట్లో వ్యవసాయ శాఖకు, ఆ విభాగానికి ప్రత్యేకతను కల్పించారు. తెలంగాణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలను రైతుల సంక్షేమం దృష్ట్యా, వ్యవసాయ పంటలకు చేయూతనిచ్చే విధంగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టారు. మొదటి రెండేండ్లు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది. ఆ తరువాత మరో వెయ్యి రూపాయలు పెంచి ఎకరానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని వానకాలం, యాసంగి సీజన్లలో అందజేస్తున్నారు.
రైతుల ఖాతాల్లో రూ.రూ.3,009.09 కోట్లు రంగారెడ్డి జిల్లాలో ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో పది సీజన్లకు గాను రూ.3,009.09 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 2018 వానకాలంలో జిల్లాలోని 2,47,694 మంది రైతుల ఖాతాలకు రూ.255.29 కోట్లను జమ చేయగా, 2022 యాసంగిలో 2,98,314 మంది రైతుల ఖాతాల్లో రూ.327.74 కోట్లను జమ చేసింది. ఐదేండ్లలో రైతుల సంఖ్య దాదాపు 50 వేల పైచిలుకు పెరిగింది. రైతు బంధు నిధులు కూడా రూ.73 కోట్ల పైకి పెరిగాయి. ప్రతి యేటా రైతుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడి సహాయం కూడా పెరుగుతూ వచ్చింది. సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు పెట్టుబడి సహాయం కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. జిల్లాలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
వ్యవసాయం.. దినదినాభివృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తున్న తీరును చూసి పక్క రాష్ర్టాల్లోని రైతులు కూడా ఆకర్షితులవుతున్నారు.
కష్టాలు తీరేలా.. పకడ్బందీగా అమలు
జిల్లాలో రూ.3 వేల కోట్ల పై చిలుకు నగదు ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా వ్యవసాయ భూమి కొన్నవారికి కూడా ఈ పథకం అమలులోకి వస్తున్నది. రైతులు తమ పేర్లను ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, లేదా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
– గీతారెడ్డి, వ్యవసాయ అధికారి, రంగారెడ్డి జిల్లా
పెట్టుబడి తిప్పలు తప్పినయి..
సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు పథకంతో పంట పెట్టుబడి తిప్పలు తప్పినయి. తెలంగాణ రాక ముందు వ్యవసాయం చేసేందుకు, పంటల పెట్టుబడులకు చానా తిప్పలు పడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక ఇప్పుడు పెట్టుబడికి తిప్పలే లేవు. 24 గంటల పాటు కరెంట్ వస్తుంది. రైతు కాలం జేస్తే.. రూ.5 లక్షల బీమాను కూడా కల్పిస్తున్నరు. రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ ఐదేండ్లుగా ‘రైతుబంధు’ ఇస్తున్నరు.
– జంగ రాములు, రైతు, జంగోనిగూడ
ఇబ్బందుల్లేకుండా వ్యవసాయం..
నాకు రెండెకరాల భూమి ఉన్నది. రైతు బంధు పథకం మొదలైనప్పటి నుంచి ‘రైతు బంధు’ వస్తున్నది. యేటా రెండు పంటలు పండిస్తాను. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.10 వేల చొప్పున లబ్ధి పొందుతున్నారు. గతంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే వాడిని. నేను పండించిన పంటలో సగం వడ్డీలకే పోయేది. నేడు ఆ పరిస్థితి లేదు. సీజన్‌కు ముందే ‘రైతుబంధు’ రావడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నా..
– నరసింహా గౌడ్, కొడిచెర్ల, కొత్తూరు (మం.)