మంచాల, జూలై 13 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలు, ఒర్రెలు కోసిన రోడ్డుతో నిత్యం వాహనదారులు ఈ రోడ్డుపై ఏదోచోట ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంతో యువతనే చేయిచేయికలిపి రోడ్డు మరమ్మత్తులు చేశారు.
మంచాల మండలం జాపాల నుండి కాగజ్ఘట్ రహదారి గుంతలతో అధ్వాన్నంగా తయారైంది. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు ఎక్కడ చూసినా గుంతలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు, ఒర్రెలు కోసిన రోడ్లతో ప్రమాదకరంగా మారింది. ఆదివారం జాపాల గ్రామానికి చెందిన యువకులు సొంత ఖర్చులతో గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు. ట్రాక్టర్లో కంకర మిక్సింగ్ తెప్పించి గోతులు పూడిపించారు. ధ్వంసమైన రోడ్డును జేసీపీ సహయంతో మరమ్మత్తులు చేయడమే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించారు. యువకులు తన సొంత ఖర్చులతో రోడ్డును తాత్కాలికంగా బాగు చేయడాన్ని పలు వాహనదారులు అభినందించారు. ఈకార్యక్రమంలో గ్రామ యువకులు, బీనమోని అంజయ్య, అశ్వల వెంకటేష్, బియ్యని సతీష్, పుడుతల నాగరాజు, ఓ మహేష్ గౌడ్, ఇబ్రహీం తదితరులు ఉన్నారు.