సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలను లాక్కొంటే మళ్లీ ముంబై, దుబాయ్ వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడనున్నదని వేడుకున్నా అధికారులు కనికరించ లేదు. ఇప్పటికే అసైన్డ్ భూముల సర్వే పూర్తి చేసిన అధికారులు.. శనివారం పోలీసుల పహారా నడుమ పట్టా భూములకు సంబంధించి సర్వే చేశారు.
వందల మంది పోలీసుల బందోబస్తు నడుమ కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని హకీంపేటలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. ఇప్పటికే కేసులు ఉన్నందున భయం భయంతో గడుపుతున్న దుద్యాల మండలం లగచెర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల రైతులు ఏమీ చేయలేని దుస్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా రైతులను ఒప్పించి భూ సేకరణ చేపడితే…కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బలవంతంగా భూములను లాక్కొంటూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నది.
– కొడంగల్, ఫిబ్రవరి 8
దుద్యాల మండలంలో ప్రభుత్వం తలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా అధికారులు సర్వే పనులు ముమ్మరం చేశారు. శుక్రవారం వరకు పోలేపల్లి, లగచెర్ల, హకీంపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూముల సర్వే చేపట్టారు. కాగా, శనివారం హకీంపేట గ్రామ పరిధిలోని 146 ఎకరాలకు సంబంధించి పట్టా భూముల్లో సర్వే చేశారు. దుద్యాల మండల తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో దాదాపు 300లకుపైగా పోలీసుల బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. గతంలో జరిగిన లగచెర్ల ఘటన భయంతో అందుబాటులో లేమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంత మంది రైతులు కష్టపడి సంపాదించుకున్న భూములను ప్రభుత్వానికి ఎందుకివ్వాలని, భూములు లాక్కుంటే ఏ విధంగా బతుకాలని ప్రశ్నిస్తున్నారు.
ఏదీ ఏమైనప్పటికీ మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. రెండు, మూడు ఎకరాల పొలం ఉన్న రైతుల పంటపొలాలే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అనువుగా ఉంటాయా.. పెద్ద మొత్తంలో భూమి ఉన్న రైతుల నుంచి భూమిని తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. హకీంపేట గ్రామ పరిధిలో మొత్తంగా 114 మంది రైతులకు సంబంధించి 146 ఎకరాల పట్టా భూముల సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 20 మంది రైతులు 40 ఎకరాలను ప్రభుత్వానికి అందిస్తున్నట్లు అనుమతిని తెలుపడం జరిగిందని తహసీల్దార్ పేర్కొన్నారు. సమ్మతి తెలిపిన రైతుల భూములతో పాటు మిగతా భూముల్లో కూడా సర్వే చేపట్టి హద్దులు గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం సమంజసం కాదు. ఉన్న భూమిని ఇచ్చి మేం ఏం పని చేసి బతకాలె. మా భూమిలో పెద్దల సమాధులు ఉన్నాయి. జిల్లాల విభజనలో హకీంపేట నారాయణపేట జిల్లాలో ఉండేది. మళ్లీ గ్రామాన్ని వికారాబాద్ జిల్లాలో కలపడం బాధగా ఉన్నది.
– రాకం, కాదయ్య, అరుణ, హకీంపేట, దుద్యాల మండలం
నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. కష్టపడి పొలాన్ని సాగు చేసుకొంటున్నా. ప్రభుత్వం రైతులను ఆదుకునేది పోయి నిల్వ నీడలేకుండా చేస్తే ఎట్లా .. వ్యవసాయం అంటేనే మాకు ఇష్టం. మీరు పైసలు, ఉద్యోగం ఇస్తామంటే ఏం చేసుకోవాలి. భూమి ఇస్తే రోడ్డు పాలు కావాలె. ఏం చేసినా మా భూమిని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేము.
– రాములు, హకీంపేట, దుద్యాల మండలం