కొడంగల్/బొంరాస్‌పేట, జూన్ 25 : కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బొంరాస్‌పేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరెడ్డికి కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల అధికారుల సైతం స్వాగతాలు పలుకుతూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్కేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రవీంద్రాచారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును తప్పుపడుతూ స్థానిక ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బూతులు తిడుతూ కొట్టడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త అనే అక్కసుతో చారిని ఇబ్బందులకు గురిచేయడం.. అదేవిధంగా ఆయనను కొట్టడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టిన ఎస్ఐని వెంటనే ఎస్పీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మూడు రోజుల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అధికారులు బెదిరిస్తున్నారని.. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా శాంతిభద్రతలకు విఘాతం కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు.
సోదరుడితో అధికారం చెలాయించాలనే ఉద్దేశముంటే ఎమ్మెల్సీ వంటి పదవిని కేటాయించి అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించాలని హితవు పలికారు. ఎటువంటి అధికారం లేని వ్యక్తులు ప్రారంభోత్సవాలు చేస్తుంటే.. తాము కూడా అధికారిక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదంతా ఎన్నికల స్టంట్
రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులు రైతు ఖాతాలో జమచేస్తున్నామని పేర్కొంటున్నారు కానీ, స్వయంగా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇంకా చాలా మందికి భరోసా నిధులు జమ కాలేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ నాయకులు రైతు భరోసాపై సంబురాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలను పురస్కరించుకొని రైతు భరోసాను విడుదల చేయడం ఎన్నికల స్టంట్‌గా ప్రజలు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికీ ఇంకా 2, 4 ఎకరాల రైతులకు రైతు భరోసా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, కేవలం అధికారాన్ని కాపాడుకోవాలనే దురాశతో ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మండలంలో మూడు చెక్‌డ్యామ్‌లను నిర్మించి రైతులకు సాగునీటి సౌకర్యాలను అందిస్తే.. నేటి కాంగ్రెస్ నాయకులు చెక్ డ్యాంలలోని ఇసుకను అక్రమంగా తోడేస్తూ, అక్రమార్జనకు పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, ఇతర హమీలను వెంటనే అమలుచేయాలంటూ గ్రామాలో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.
అనంతరం సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా అమరచింతలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను అవిష్కరించారు. విగ్రహ ఆవిష్కణకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు అభిమానులు పెద్దఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు యాదగిరి, చాంద్‌పాషా, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు రవిగౌడ్, నరేశ్‌గౌడ్, శ్రీనివాస్, మధుసూదన్‌రావు యాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, తిరుపతయ్య, లక్ష్మణ్‌నాయక్, మల్లేశ్‌గౌడ్, అనంత్గౌడ్, శ్రీను, హీరూనాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.