రంగారెడ్డి, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వేలాదిగా ఉండగా.. ఇటీవల మళ్లీ కొన్ని వెలిశాయి. రాత్రయితే చాలు రిసార్టుల్లో డీజేల మోతలు వినిపిస్తున్నాయి. మద్యం, గం జాయి, డ్రగ్స్ వంటివి ఏరులై పారుతున్నాయి. అధికారులు, పోలీసుల నిఘా కొరవడడంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, కందుకూరు, కొత్తూరు, కేశంపేట, తలకొండపల్లి, తుక్కుగూడ వంటి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రిసార్టులున్నాయి. వీటిలో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయి. బర్త్‌డే, గెట్ టు గెదర్, వివిధ ఐటీ పరిశ్రమలు, కంపెనీలకు చెందిన పార్టీలు, శుభకార్యాలకు సంబంధించినవి అధికంగా నిర్వహిస్తున్నారు. ఈ పార్టీలకు డీజేలు, విదేశీ మద్యాన్ని ఎలాంటి అనుమతుల్లేకుండా వినియోగిస్తున్నారు. మద్యం మత్తులో అసాంఘిక కార్యక్రమాలూ జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలోని శివారు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రిసార్టులుండడంతో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున వీకెండ్ పార్టీల పేరుతో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకలు, నూతన వస్ర్తాలంకరణ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గెట్ టు గెదర్ వంటి వాటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వాటి పేరుతో మద్యం, గంజాయి, డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు. అలాగే, రేవ్ పార్టీలూ నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్ ము న్సిపాలిటీలతోపాటు మంచాల మండలంలోని ఆరుట్ల, పీసీతండా, బోడకొండ, లోయపల్లి, యాచారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటైన రిసార్టుల్లో యువత వీకెండ్లో జల్సాలు చేసుకునేందుకు అద్దెకు ఇస్తున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. వాటి నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలున్నాయి.
గత 15 రోజుల్లో జిల్లాలోని శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లోని పలు రిసార్టుల్లో ఎస్వోటీ పోలీసులు మూడు రేవ్పార్టీలను భగ్నం చేశారు. ఈ పార్టీల్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. రిసార్టుల్లో అత్యధికశాతం ఇలాంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి.