వికారాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ గనుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో అటవీ భూములంటూ అధికారులు నిలిపివేశారు. అయితే, రెవెన్యూ, అటవీశాఖల అధికారుల నిర్లక్ష్యంతో కొన్నేండ్లుగా మళ్లీ సాగుతున్నాయి. గౌరారంలోని 2,000 ఎకరాల భూములను అటవీశాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రతిపాదించినా రెవెన్యూ అధికారులు అటవీ భూములను కబ్జా చేసి సాగు చేసిన వారికి పట్టాలిస్తూ పోవడంతో ఆ భూములు 180 ఎకరాలకు కరిగిపోయాయి.
అయినా, అవి పట్టా భూములంటూ కొందరు మైనింగ్ వ్యాపారులు కోర్టుకెళ్లడం.. కాదు..కాదు..అవి అటవీ భూములంటూ అటవీశాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా.. దానికి సంబంధించిన ఫైళ్లను ఉన్నతాధికారులు పరిశీలించగా.. ఆ భూములు మొత్తం ఫారెస్ట్‌కు చెందిందన్న విషయం బయటపడడంతో అధికారులు అక్రమ గనుల తవ్వకాలను నిలిపివేశారు. అయితే, మైనింగ్ లీజు ముగియడంతో రెన్యువల్‌కు మైనింగ్ వ్యాపారులు దరఖాస్తు చేసుకోగా అటవీ, గనుల శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో గనుల శాఖాధికారులు రెన్యువల్ చేశా రు. దీంతో అటవీశాఖ అధికారులు మైనింగ్ అధికారులకు నోటీసులిచ్చారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎలా రెన్యువల్ చేస్తారంటూ తాఖీదులో పేర్కొన్నారు. అయితే, సీఎం సోదరుడి సన్నిహితులే ఈ అక్రమ గనుల తవ్వకాలను కొన సాగిస్తున్నారని.. అందుకే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గౌరారం రిజర్వ్ ఫారెస్ట్ కాగితాలకే పరిమితమైంది. సుమారు 10 లక్షలకు పైగా చెట్లు ఉండాల్సిన ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద పెద్ద రాళ్లు, గుట్టలే మిగిలాయి. అంతేకాకుండా 2,000 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ అనుకున్న ఈ అటవీ ప్రాంతంలోని ఒక్క ఎకరా కూడా అటవీశాఖ అధికారుల ఆధీనంలో ప్రస్తుతం లేకపోవడం గమనార్హం. బొంరాస్‌పేట మండలం, గౌరారంలోని సర్వేనంబర్ 127 లోని 2,000 ఎకరాల అటవీ భూములను 1971లో రిజ ర్వ్ ఫారెస్ట్‌గా ప్రతిపాదించారు. తదనంతరం అటవీశా ఖ అధికారులు ఆ భూములను పట్టించుకోకపోవడంతో క్రమంగా తగ్గుతూ 180 ఎకరాలకు చేరింది.
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోపాటు రెవెన్యూ అధికారులు అటవీ భూములను కబ్జా చేసి సాగు చేసిన వారికి పట్టాలిస్తూ పోవడంతో ప్రస్తుతం ఒక్క ఎకరం కూడా ఫారెస్ట్ ఆఫీసర్ల చేతుల్లో లేకుండా అన్యాక్రాంతమైంది. కాగా, సర్వేనంబర్ రీ అలాట్మెంట్ ప్రక్రియలో భాగంగా సర్వేనంబర్ 127.. 82గా మారింది. సర్వేనంబర్ రీ అలాట్మెంట్ అయిన విషయాన్ని రెవెన్యూ అధికారులు అటవీశాఖ అధికారులకు చెప్పకుండానే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయి తే, సంబంధిత 180 ఎకరాల అటవీ భూములూ అన్యాక్రాంతమవుతుండడంతో రెవెన్యూ అధికారులు సర్వేనంబర్ 82 గురించి అటవీ శాఖ అధికారులను ఆరా తీయగా ..ఆ సర్వేనంబర్‌తో మాకు సంబంధం లేదని అప్పటి అధికారులు చెప్పినట్లు సమాచారం.
ఎందుకంటే సర్వేనంబర్ 127.. 82గా మారినట్లు వారికి సమాచారం లేకపోవడమే. రిజర్వ్ ఫారెస్ట్‌ను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 180 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా ఫారెస్టు శాఖ ఆధీనంలో లేదు. రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు అక్కడ రాళ్లు, గుట్టలే కనిపించడంతో కం గుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా వారు చర్యలు చేపట్టారు.