కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలిపాయి. ఇబ్ర హీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడలో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో ఉన్న జాతిపిత విగ్రహానికి బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, సరూర్‌నగర్ డివిజన్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాం గ్రెస్ నాయకులు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఆ తర్వాత కనీసం నాలుగు హామీలను కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. హే మహాత్మా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడం లో విఫలమైంద ని..సర్కారు కండ్లు తెరిపించి వాటిలో కొన్నింటినైనా అమలు చేసేందుకు బుద్ధిని ప్రసాదించడంతోపాటు ప్రజలకు సేవ చేసేలా చూడు అని వేడుకున్నారు.
రైతుభరోసా పథకాన్ని కేవలం ఒక్కో గ్రామానికే పరిమితం చేసి చేతులు దులుపుకొన్నారని..ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకొని వాటిని అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని మండిపడ్డారు. గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని సీఎం, మంత్రులు పదే పదే వేదికలపై ప్రకటించినా.. ఆ పార్టీ అనుకూల వ్యక్తులకే వర్తించేలా జాబితాలు రూపొందించి గ్రామసభల్లో చదివి వినిపించారని, ఇది ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఆయా పథకాలను అర్హులకు వర్తింపజేయాలని వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా వాటిని ఎప్పుడు ఇస్తారో చెప్పలేకపోతున్నారని, చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నించారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ